గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని వెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో కార్పొరేషన్‌ను కాపాడుకోవాలని వైసీపీ అధినేత జగన్ కొందరు సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఈ బాధ్యతను అప్పగించారు. ఇదే సమయంలో మిగిలిన నాయకులకు కూడా సహకరించాలని సూచించారు. వీరిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు.
వీరితో పాటు గాజువాక మాజీ ఎమ్మెల్యే కూడా కీలక పాత్ర పోషించి కార్పొరేటర్లను కాపాడుకోవాలని, పార్టీని నిలబెట్టాలని ఆదేశించారు. అయితే ఉత్తరాంధ్రకు ఇంచార్జ్‌గా కన్నబాబును నియమించడాన్ని ఆది నుంచి తప్పుబడుతున్న కొంత మంది నాయకులు ఇప్పుడు అవకాశాన్ని చూసుకుని తమ పంతానికి పోయినట్టు తెలుస్తోంది. ఎలానూ ఇంచార్జ్ కన్నబాబే కాబట్టి ఆయనే చూసుకుంటారని భావించారు. మరోవైపు తాను పిలిస్తే తప్ప ఎవ్వరూ ముందుకు రాకపోవడంపై కన్నబాబు కూడా అలిగారు.
ఫలితంగా, ఎవరి వారు ఈ వ్యవహారాన్ని చూసుకున్నారు. కన్నబాబు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. గుడివాడ అమర్నాథ్‌తో సహా ఇతర నాయకుల మధ్య సమన్వయం లోపించింది. దీంతో అందరినీ ఇతర రాష్ట్రాలకు తరలించి కాపాడుకునేందుకు ప్రయత్నించాలన్న వైసీపీ అధిష్టానం ఆదేశాలు కొందరికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఫలితంగా కుటుంబాలుగా పార్టీలో నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారు. ఇది వారి తప్పుకాదు, పార్టీ తరఫున బలమైన హామీ ఇవ్వకపోవడమే కారణం.
ఇక ఇప్పుడు విప్ జారీ చేస్తామని, దానిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. కానీ వాస్తవానికి మెజారిటీ సభ్యులు చేజారిపోయిన తర్వాత విప్ జారీ చేసి ప్రయోజనం ఏముంటుంది అన్నది ముఖ్యం. ఇప్పటికే కూటమికి కావల్సిన మెజారిటీ ఉంది. ఇంకా వైసీపీ నుంచి బయటకు వచ్చే నాయకులు రెడీగా ఉన్నట్టు సమాచారం. సో, ఎలా చూసుకున్నా నాయకుల మధ్య పంతాలు, సమన్వయ లోపం కారణంగా వైసీపీలో చీలికలు వచ్చాయని అనిపిస్తోంది.