కూల్ కూల్ గా!… ఏసీలకూ మోదీ సబ్సీడీ స్కీమ్!

దేశంలో సంక్షేమ పథకాలకు కాదేదీ అనర్హం అన్నట్టుగా సాగుతోంది ఎన్డీఏ పాలన. ప్రతి విషయంలోనూ సబ్సీడీలు, ప్రోత్సాహకాలు, రాయితీలు అంటూ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… ఇప్పుడు వేసవిలో చల్లబరిచే ఏసీలకూ సరికొత్త సబ్సీడీ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారట. ప్రధాన మంత్రి ఎయిర్ కండీషనర్ యోజన (పీఎం ఏసీ యోజన)గా పరిగణిస్తున్న ఈ పథకానికి ఇంకా తుది రూపు రాలేదు గానీ… కసరత్తు అయితే శరవేగంగానే జరుచరుగోంతట. ఒక్కసారిగా ఈ పథకం అమల్లోకి వస్తే.. దేశంలోని దాదాపుగా అన్ని వర్గాల ప్రజలూ ఈ పథకం కింద సబ్సీడీ రేట్లకే ఎయిర్ కండీషనర్లను పొందవచ్చట.

వేసవి వచ్చిందంటే చాలు… ఏటికేడు ఎండల వేడి పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా వేసవి రాకముందే వేడిమి తాకిడికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఏసీ వినియోగం అనేది ఇప్పుడు ఏదో లగ్జరీ కాకుండా నిత్యావసరంగానే మారిపోయిందని చెప్పక తప్పదు. వెరసి ఎడాపెడా ఏసీలు పెరిగిపోతుంటే.. వాటి వినియోగంతో విద్యుత్ వినియోగం కూడా ఏటికేడు అంచనాలు దాటిపోతోంది. 2021-22 లో 8.4 మిలియన్ యూనిట్ల వినియోగం ఉన్న ఏసీల విద్యుత్ వినియోగం 2022-23 నాటికి ఏకంగా 11 మిలియన్ యూనిట్లకు పెరిగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే.. జనానికి నిత్యావసరంగా మారిన ఏసీలను సబ్సీడీల కింద ఇవ్వడంతో పాటుగా విద్యుత్ వినియోగాన్ని తగ్తించడమే కాకుండా జనంపైనా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే దిశగా ఈ పథకం రూపకల్పన జరుగుతోందన్న మాట.

ప్రస్తుతం ఢిల్లీలో ఈ తరహాలో ఓ పథకం అమలు అవుతోంది. ఈ పథకం కింద 3 స్టార్ అంతకంటే తక్కువ గ్రేడ్ ఉన్న ఏసీలను తిరిగిస్తే.. 5 స్టార్ ఏసీలను దాదాపుగా 60 శాతం సబ్సీడీతో అందిస్తున్నారు. ఈ పథకం ఢిల్లీలో బాగా క్లిక్ అయ్యింది కూడా. 5 స్టార్ ఏసీల వినియోగం ద్వారా విద్యుత్ ను భారీ ఎత్తున ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. అయితే 3 స్టార్ ఏసీల కంటే 5 స్టార్ ఏసీలు ధరలో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఫలితంగా మిడిల్ క్లాస్ జనం విద్యుత్ ను ఆదా చేసే 5 స్టార్ ఏసీలను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫలితంగా తక్కువ స్టార్ రేటింగ్ కలిగిన ఏసీలను తక్కువ ధరలకే కొనుగోలు చేశామని సంబర పడుతున్న జనం.. విద్యుత్ చార్జీలను మాత్రం భారీగానే చెల్లిస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థను పరిశీలించిన కేంద్రం ఏసీ యోజనకు శ్రీకారం చుట్టాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది.

ఈ పథకం ఎలా అమలు అవుతుందన్న విషయానికి వస్తే… ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమచారం మేరకు వినియోగదారులు తమ వద్ద ఉన్న తక్కువ స్టార్ రేటింగ్ ఏసీలను అధీకృత డీలర్లకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అక్కడికక్కడే వారికి డీలర్ల నుంచి కూపన్లు లబిస్తాయి. ఈ కూపన్లను తీసుకెళ్లి ఎంచక్కా… 5 స్టార్ ఏసీలను వినియోగదారులు సబ్సీడీ రేట్లకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ తక్కువ స్టార్ రేటింగ్ ఏసీలను సేకరించిన డీలర్లు వాటిని తమ కంపెనీలకు పంపిస్తే.. వాటిని 5 స్టార్ ఏసీలుగా ఆయా కంపెనీలు తీర్చిదిద్దుతాయి. ఇలా ఎన్ని తక్కువ స్టార్ ఏసీలను కలెక్ట్ చేస్తే.. ఆ మేర విద్యుత్ ను ప్రభుత్వం కంపెనీలకు ఇస్తుందట. మొత్తంగా ఓ రీసైక్లింగ్ వ్యవస్థలా కనిపించే ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు గానీ… వస్తే మాత్రం అన్నిరకాలుగా మంచి పథకంగా గుర్తింపు దక్కించుకోనుంది.