“మీ విచారణను వీడియోలు.. ఆడియోలు తీయాలని కోరుతున్నారు. అంటే.. అధికారులు మిమ్మల్ని (పిటిషనర్) కొడతారని భయపడుతున్నారా?” అని వైసీపీ ఎంపీ.. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. వైసీపీ హయాంలో జరిగినట్టు ప్రభుత్వం పేర్కొంటున్న మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు దీనిని నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల కిందటే మిథున్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అయితే.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి.. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు తె చ్చుకున్నారు. కానీ, ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని చూసినా.. హైకోర్టు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే.. తాజాగా శుక్రవారం మిథున్‌రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి నోటీసులు అందుకున్నారు. ఈక్రమంలో తనను విచారించే ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగు చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా గురువారం సాయంత్రం దీనిని విచారించిన హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డింగులకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. ఎలానూ సిట్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉంటాయని.. అవి అన్నింటినీ రికార్డు చేస్తాయని తెలిపింది. అయితే.. సొంతగా ఇద్దరు న్యాయవాదులను వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు కొడతారని భయమా? అని ఎంపీ తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది.
అయితే.. తమకు అలాంటి భయం లేదని.. కానీ, ఆధారాల కోసం రికార్డు చేయాలని కోరుతు న్నామన్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి.. ఇతర మాధ్యమాలు అవసరం లేదని పేర్కొంది. అదేసమయంలో సీసీ కెమెరాలను ముందుగానే చెక్ చేసుకోవాలని.. విచారణ ముగిసిన తర్వాత.. సాంకేతిక కారణాలు చూపుతూ.. అవి రికార్డు కాలేదని చెప్పడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది.