నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి అన్నగారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. దీనిని దేశంలోనే పెద్దదిగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి పెద్ద విగ్రహంగా ఉంది. దీనిలోనే మ్యూజియం, గ్రంథాలయం, ఎగ్జిబిషన్ వంటివి కూడా ఉన్నాయి.
అయితే.. దీనికి మించిన విధంగా అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలన్నది టీడీపీ ఆలోచన. తద్వారా.. అన్నగారి కీర్తిని అజరామరంగా.. నిలిచిపోయేలా.. ప్రపంచ దేశాల నుంచి వచ్చే వారికి కూడా.. ఆయన విశేషాలు తెలిసేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. ఈ నిర్మాణానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. టీడీపీని వ్యతిరేకించే వైసీపీ కూడా.. అన్నగారిని అభిమానిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. చిక్కల్లా.. కేంద్రం నుంచి అంత పెద్ద విగ్రహానికి అనుమతి రావాల్సి ఉంటుంది. పైగా.. కేంద్రం ఇప్పటి వరకు ఇలాంటి విగ్రహాలను అనుమతించలేదు. తెలంగాణలోనూ.. అంబేడ్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తుతో నిర్మించినా.. గుజరాత్‌లోని వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మించి కట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో విగ్రహం ఎత్తును తగ్గించి.. డయాస్ ఎత్తును పెంచుకున్నారు. ఇది బీఆర్ ఎస్ హయాంలోనే జరిగింది.
ఇక, తమిళనాడులోనూ కరుణానిధి విగ్రహానికి అసలు అనుమతులే ఇవ్వలేదు. సాధారణంగా.. ఒక ఎత్తు వరకు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఉంటుంది. కానీ.. 100 మీటర్ల ఎత్తు దాటిన తర్వాత.. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. విమాన రాకపోకలు.. గగన తల మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అనుమతి ఇస్తుంది. సో.. ఈ విషయంలో పటేల్‌ను మించిన విగ్రహం నిర్మించేందుకు కేంద్రం ఏమేరకు అనుమతి ఇస్తుందో చూడాలి.