ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తరచుగా ఆయన కష్టాల్లో ఉన్నవారికి తన సొంత నిధుల నుంచి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గిరిజనులకు వినూత్న కానుకలు పంపించి.. వారికి `రక్ష`గా ఉంటానని మరోసారి నిరూపించుకున్నారు. ఈ విషయం తెలిసిన జనసేన పార్టీ అభిమానులు ఫిదా అవుతుంటే.. ఆపార్టీ నాయకులు పవన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
విషయం ఏంటి?
ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా 10000మంది పిఠాపురం మహిళలకు పవన్ కల్యాణ్ చీరు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తనను ఆదరించి గెలిపించిన ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. స్వయంగా ఆయన వెళ్లకపోయినా.. పార్టీ నాయకులతో పంపిణీ చేశారు. ఈ పరిణామం స్థానికంగా పవన్ పై మంచి గ్రాఫ్ ను పెంచింది.
తాజాగా.. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులు ప్రారంభించేందుకు “అడవితల్లి బాట“ పేరుతో పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కురిడి, పెదపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భం గా ఆయన రచ్చ బండ కార్యక్రమం కూడా నిర్వహించారు. చదునైన రోడ్లు లేకపోవడం.. ఎక్కడికక్కడ ముళ్లు, రాళ్లు రప్పలు పేరుకుపోయి ఉండడాన్ని గమనించారు. వీటిపై రోడ్లు వేయిస్తానని చెప్పారు. ఇదేసమయంలో అలాంటి రోడ్లపై పాదాలకు చెప్పులు లేకుండా గిరిజన మహిళలు నడుస్తున్న తీరును చూసి ఆయన చలించి పోయారు. దీనిపై వారిని ప్రశ్నించారు.
తమకు చెప్పులు కొనుక్కునేంత ఆర్థిక స్తోమత లేదని కొందరు చెప్పారు. మరికొందరు తమకు అలవాటైపోయిందన్నారు. అక్కడ మౌనంగా ఉన్న పవన్ కల్యాణ్.. తాజాగా తన సొంత సొమ్ముతో 300 మంది గిరిజనులకు తాజాగా నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు. వీటిని తాను వెళ్లకపోయినా.. తన కార్యాలయం అధికారులకు ఇచ్చి పంపించారు. గురువారం ఉదయం పెదపాడు, కురిడి గ్రామాల్లో పర్యటించిన అధికారులు వాటిని పంచారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates