నాయకులు పట్టుబట్టి విజయం దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒకప్పుడు వైసీపీ హవాలో ఉన్న ఈ సింహపురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది పటాటోపంగానే ఉందని.. తమకు ఎలాంటి పవరూ లేదని చెప్పుకొస్తున్నారు తమ్ముళ్లు. వైసీపీ నుంచి కొందరు నాయకులు.. గత ఎన్నికలకు ముందు టీడీపీ బాట పట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజయం దక్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండగా.. కూడా వారే అధికారంలో ఉండి చక్రం తిప్పారు. దీంతో అప్పటి విపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు వీరిపైపోరాటం చేశారు.
కానీ, వారు గతంలో పోరాటం చేసిన వారే.. ఉద్యమాలు చేసి.. నిరసనలు వ్యక్తం చేసిన వారే.. ఇప్పుడు కామ్ అయిపోయారు. కారణం.. వైసీపీలో ఉండగా చక్రంతిప్పిన చాలా మంది నాయకులు చంద్రబాబు వద్ద పట్టు పెంచుకుని.. ఇప్పుడు కూడా చెలరేగి పోతున్నారు. దీంతో తమ్ముళ్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేతురా లింగా! అంటూ పద్యాలు పాడుకుంటున్నారు. 2024కు ముందు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్‌కుమార్ యాదవ్ తిరిగి అంతకంటే తీవ్రంగా టీడీపీలో చక్రం తిప్పుతూ.. మైనింగ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ పాత నేతలు.. గతంలో వీరే మైనింగ్ చేస్తున్నారంటూ ఉద్యమించిన తమ్ముళ్లు ఇప్పుడు రగిలిపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. కానీ, దానిని అడ్డు పెట్టుకుని కీలక గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్‌పోర్ట్ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నా.. తమ్ముళ్లకు తెలిసినా.. ఎవరూ మాట్లాడడం లేదు.
మరోవైపు.. కీలకమైన.. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని నాయకులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. పన్నెత్తు మాట కూడా అనడం లేదు. కానీలోలోన మాత్రం కుమిలి పోతున్నారు. దీనికి కారణం.. బలమైన నాయకుడు ఎంపీగా ఉండడం, ఆయనకు చంద్రబాబు దగ్గర మంచి లౌక్యం ఉండడంతోపాటు.. ఆయన సతీమణి కూడా.. ప్రజాప్రతినిధిగా ఉండడంతో ఆయన పరివారానికి ఎదురు లేకుండా పోయింది. దీంతో అయ్యో.. ఒకప్పుడు వీరిపైనే యుద్ధం చేశాం.. ఇప్పుడు కూడా.. అదే పనిచేస్తున్నా.. మౌనంగా ఉండాల్సి వచ్చిందే.. అని వాపోతున్నారు తమ్ముళ్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates