తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ సాయిరెడ్డి… కొన్నాళ్ల కిందట తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి కూడా రిజైన్ చేశారు. అనంతరం.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఇది ఎమ్మెల్యే కోటా రాజ్యసభ సీటు కావడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఈ సీటును ఆయనకు రెండో సారి కేటాయించారు.
అయితే.. పార్టీ ఓటమి.. వైసీపీ అధినేతకు, సాయిరెడ్డికి మధ్య పొసగపోవడం.. మధ్యలో తంత్రీపాలురు మాదిరిగా.. కొందరి జోక్యం పెరిగిపోయిన నేపథ్యంలో సాయిరెడ్డి ఏకంగా పార్టీ కి, పదవికి కూడా రాజీనామా సమర్పించారు. దీంతో తాజాగా బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 29 వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. మే 9న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇక, సంఖ్యా బలం ప్రకారం.. ఈ సీటు కూడా కూటమి పార్టీలకే దక్కుతుంది. ఈ నేపషథ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుంది? ఎవరిని వరిస్తుందన్నది పెద్ద ప్రశ్న. రాజ్యసభ విషయానికి వస్తే.. జనసేన ఆది నుంచి ఈ విషయంపై దూకుడుగానే ఉంది. తమకు లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉందని, రాజ్యసబలో లేనందున.. తమకు అవకాశం ఇవ్వాలనికొన్నాళ్లుగా కోరుతోంది. ఈ క్రమంలో జనసేనకు కేటాయిస్తారా? అనేది చూడాలి.
కానీ, టీడీపీని చూసుకుంటే.. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ మోస్టు నాయకులు రాజ్యసభకు వెళ్లాలన్న కోరికను బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, మరింత మంది సీనియర్లు కూడా ఉన్నారు. పైగా చంద్రబాబుకు ఆపద్బాంధువుడు వంటి కనకమేడల రవీంద్రకుమార్.. కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎవరికి ఎవరు సద్వినియోగ పరుస్తారన్నది చూడాలి. అయితే.. చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున… ఆయన తిరిగి వచ్చే వరకు అంటే.. ఈ నెల 24 వరకు టెన్షన్ కొనసాగనుంది.