అదే జ‌రిగితే.. తెలంగాణ‌ సీఎస్‌ను జైలుకు పంపిస్తాం: SC

తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్పుబ‌ట్టిన సుప్రీంకోర్టు 1996 నాటి.. వాల్టా చ‌ట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా.. అట‌వీ శాఖ అధికారుల‌ను కూడా జైలుకు పంపిస్తామ‌ని హెచ్చ‌రించింది. దీనిపై త‌మ‌కు స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఏం జ‌రిగింది?

కంచ గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ప‌క్క‌నే ఉన్న 400 ఎక‌రాల వ్య‌వ‌హారం వివాదం గా మారిన విష‌యం తెలిసిందే. ఈ భూమి త‌మ‌దేన‌ని ప్ర‌భుత్వం.. కాద‌ని యూనివ‌ర్సిటీ వాదించుకుంటున్నాయి. ఇంత‌లోనే స‌ర్కారు.. స‌ద‌రు భూమి విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుని.. స్వాధీనం చేసుకుంది. ఆ వెంట‌నే.. 100 ఎక‌రాల్లో ఉన్న చెట్ల‌ను న‌రికేయించింది. దీనిని త‌ప్పుబ‌డుతూ.. బీఆర్ఎస్ స‌హా.. ప‌లువురు సామాజిక ఉద్య‌మ‌క‌ర్త‌లు.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ పిటిష‌న్లను బుధ‌వారం విచారించిన న్యాయ‌స్థానం.. కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది. 100 ఎక‌రాల్లో ప‌చ్చద‌నాన్ని ధ్వంసం చేసిన‌ప్పుడు సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించారా? లేదా? అని ప్ర‌శ్నించింది. దీనికి న్యాయ స‌ల‌హాదారుగా ఉన్న అమిక‌స్ క్యూరి ప్ర‌భుత్వం అన్ని నిబంధ‌న‌లు పాటించి.. చెట్లు న‌రికించింద‌ని..అది ప్ర‌భుత్వ భూమేన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. సుప్రీంకోర్టు.. అది ప్ర‌భుత్వ భూమా? అమ్ముంటారా? కొంటారు? ధారాద‌త్తం చేస్తారా? అన్న‌ది త‌మ‌కు సంబంధం లేద‌ని.. వాల్టా చ‌ట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధన‌లు పాటించారా? లేదా? అన్న‌దే ప్ర‌శ్న అని.. దీనిని ఉల్లంఘించిన‌ట్టు తేలితే.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా సంబంధిత అధికారులు అంద‌రినీ జైలుకు పంపిస్తామ‌నిహెచ్చ‌రించింది.

ఏంటి మార్గ‌ద‌ర్శ‌కాలు..

పంజాబ్‌లో చెట్ల న‌రికివేత వ్య‌వ‌హారం పై సుప్రీంకోర్టులో 1991లో వ‌రుస పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. వాల్టా చ‌ట్టం(వాట‌ర్‌-ల్యాండ్‌-ట్రీస్ -యాక్ట్‌-1977) ప్ర‌కారం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఎక్క‌డైనా భూమి అవ‌స‌ర‌మైన‌ప్పుడు.. దానిలో చెట్లు ప‌చ్చ‌ద‌నం తీసేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఎంత విస్తీర్ణంలో అయితే.. చెట్ల‌ను న‌రికేశారో.. దానికి రెండింత‌లు విస్తీర్ణం వేరే చోట కేటాయించి.. అక్క‌డ మొక్క‌లు నాటాలి. ఇదీ కీల‌క ఆదేశం. ఇప్పుడు దీనినే సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. అయితే.. ఇలానే చేశామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. అయితే.. ఆధారాలు ఇవ్వాల‌ని.. అఫిడ‌విట్ వేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.