బాబు ‘అమ‌రావ‌తి’ క‌ల చాలా పెద్దది

ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యం గురించి చెబుతూ… మంత్రి నారాయ‌ణ ఒక మాట చెప్పారు. “మ‌నం వ‌చ్చే రెండు మూడేళ్ల గురించి మాత్ర‌మే ఆలోచిస్తామ‌ని.. కానీ, చంద్ర‌బాబు మాత్రం వ‌చ్చే 100 నుంచి 150 ఏళ్ల భ‌విత‌వ్యాన్ని స్వ‌ప్నిస్తారు” అని అన్నారు. ఔను. ఇది నిజ‌మే అని నిరూపించే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు స్వ‌ప్న‌మే సాకార‌మైతే.. ఇక‌, తెలంగాణ రాజ‌ధాని, ద‌క్షిణాదిలో బెంగళూరు న‌గ‌రంతో స‌రిసమానంగా పుంజుకుంటున్న హైదరాబాద్‌ను కూడా త‌ల‌ద‌న్నేలా అమ‌రావ‌తిని ఆవిష్కృతం కానుంది.

విష‌యం ఏంటంటే.. అమ‌రావ‌తి అంటే..ప్ర‌స్తుతం ఉన్న గ్రామాలు, 33 వేల ఎక‌రాలు మాత్ర‌మే కాకుండా.. ఇప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధానిని ఇత‌ర విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి, గుంటూరు, తాడేప‌ల్లి ప్రాంతాల‌ను కూడా .. అనుసంధానించ‌డం ద్వారా.. మ‌హానగ‌రాన్ని నిర్మించాల‌ని భావిస్తున్నారు. ఇది జ‌రిగితే.. హైద‌రాబాద్‌-సికింద్రాబాద్ జంట న‌గ‌రాల‌ను మించిన మ‌హానగ‌రంగా మార‌నుంది. ఫ‌లితంగా.. ఇక‌, తిరుగులేని ఆర్థిక రాజ‌ధాని న‌గ‌రం సాక్షాత్క‌రిస్తుంది.

ఈ దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ వెల్ల‌డించారు. వాస్త‌వానికి తొలినాళ్ల‌లో విజ‌య‌వాడ‌-గుంటూరు న‌గ‌రాల‌నే అనుకున్నారు. దీంతో ఆయా న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయాల‌ని భావించారు. స‌రే.. వైసీపీ వ‌చ్చాక ఏం జ‌రిగింద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు మరోసారి రాజ‌ధాని ప‌నులు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ స్థాయిలో రాజ‌ధానికి గుర్తింపు తీసుకువ‌చ్చేందుకు దీనిని మ‌హాన‌గ‌రంగా(మెగా సిటీ) తీర్చిదిద్దేందుకు చంద్ర‌బాబు సంక‌ల్పించారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా.. విజ‌య‌వాడ‌-తాడేప‌ల్లి-మంగ‌ళ‌గిరి-గుంటూరు న‌గ‌రాల‌ను క‌లుపుతూ.. మ‌హా న‌గరంగా తీర్చిదిద్ద‌నున్నారు. దీని విస్తీర్ణం.. హైద‌రాబాద్‌-సికింద్రాబాద్ జంట న‌గ‌రాల‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ‌గానే ఉంటుంది. సో.. అప్పుడు అమ‌రావ‌తి మ‌హాన‌గ‌రం.. ప్ర‌పంచ స్థాయి సిటీగా భాసిల్ల‌నుంది.