కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి టార్గెట్ చేశారు. విచారణకురావాలంటూ.. తాజాగా ఆయనకు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. వచ్చేప్పుడు.. గుర్గావ్‌లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు.
కాగా.. గత మూడేళ్ల కిందటే వాద్రాపై కేసులు నమోదయ్యాయి. అయితే.. ఆయన వీటిని గతంలోనే కోర్టులో సవాల్ చేయగా.. కొన్ని కేసుల్లో స్టే లభించినా.. గుర్గావ్ భూములకు సంబంధించి.. మాత్రం కోర్టు విచారణ వాయిదాపడంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈడీ ఈ కేసుల విచారణను ముమ్మరం చేసింది. గత నెలలోనే ఒక నోటీసును జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే.. వాద్రా ఈ విచారణకు రాకుండా..ఈడీ తన పరివారం చెప్పినట్టు వింటోందని రాజకీయ విమర్శలు చేశారు.
ఇక, అసలు విషయానికి వస్తే… కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తొలి దశలో అంటే.. 2004-14 మధ్య ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి దానిని 1000 కోట్లకు విక్రయిం చారన్న ఆరోపణలు వున్నాయి. అయితే.. ఈబూములు ఇచ్చిన వారికి వాద్రా తిరిగి సొమ్ములు చెల్లించ కుండానే.. వాటిని ఆక్రమించారని ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి యూపీలో 2 హయాంలోనే ఈ కేసులు వచ్చినా.. అప్పట్లో తొక్కిపెట్టారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుల్లో కదలిక వచ్చింది.
మొత్తం రూ.7.5 కోట్ల విలువైన భూ వ్యవహారంలో కేసులు నమోదై.. విచారణ దశకు కూడా వచ్చాయి. అయితే.. కోర్టుల జోక్యంతో విచారణ మందగించింది. కాగా.. ఇప్పుడు మరోసారి వాద్రాకు వరుస నోటీసులు రావడం గమనార్హం. కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. గుజరాత్‌పై తాము ఫోకస్ చేస్తున్నందుకే.. తమ పార్టీ నాయకుల కుటుంబాలపై కేసులు పెడుతున్నారని విచారణల పేరుతో వేధిస్తున్నారని కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు.