బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనతో ప్రజలు, పారిశ్రామిక వేత్తలు విసుగు చెందారని అన్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆయా వర్గాలుకోరుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా సరే.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఒత్తిళ్లు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సొమ్ములు కురిపించేందుకు.. పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఈక్రమంలోనే గతంలో బీఆర్ ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడు పడిపోతోందో చెప్ప లేమని ఒకసారి, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని మరికొన్ని సార్లు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాలను వారు గుర్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి.. ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని తండ్రీ కొడుకులు మురిసిపోతున్నారని.. అందుకే తమ కీలక నాయకుడు కొత్త ప్రభాకర్‌రెడ్డితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని పొంగులేటి వ్యాఖ్యానించారు. అయితే.. తమది ప్రజాప్రభుత్వమని.. ఎవరూ తమను గద్దె దింపలేరని ఆయన చెప్పారు. ప్రజా రంజక పాలనను చూసి ఓర్వలేక.. ఇలా చేస్తున్నారని అన్నారు. తమప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా సంపాయించిన సొమ్మును లాగేసుకుంటుందన్న భయంతోనే ఇలా వ్యాఖ్యానించారని దుయ్యబట్టారు.