తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం.. భోగి మంటలు రేపుతోంది. ఎవరిని కదిపినా.. భగ్గుమంటున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. మాజీ మంత్రి జానా రెడ్డిని.. ఈ విషయంలో ‘ధ్రుతరాష్ట్రుడి’ పాత్ర పోషిస్తున్నారంటూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించి 24 గంటలు కూడా గడవకముందే.. మరో ఎమ్మెల్యే ఇప్పుడు ఖస్సు మంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సైతం.. కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. మంత్రి వర్గ విస్తరణలో తన పేరు ఉంటుందని ఆయన.. ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. ఇదేసమయంలో తన పేరును మంత్రి వర్గ జాబితా నుంచి తీసేసేందుకు ఓ ‘కుటుంబం'(పేరు చెప్పలేదు) తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. దీనికి సంబంధించి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. అధిష్టానానికి తనపై ఫిర్యాదులు చేస్తున్నారన్న ఆయన.. ఇలా తనను మంత్రివర్గం జాబితా నుంచి తొలగించడం అంటే.. తన గొంతును కోసిన ట్టేనని వ్యాఖ్యానించారు. ఇలా చేస్తే.. మంచిర్యాల ప్రజలు ఎవరినీ క్షమించరంటూ.. మరో సంచలన కామెంట్ చేశారు. తనకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోతే.. అప్పుడు మాట్లాడతానని ఒక రకంగా హెచ్చరికలు జారీ చేశారు.
అసలేంటి వివాదాలు?
తెలంగాణలో రాక రాక దక్కిన అధికారం.. మళ్లీ ఎన్నికల్లో ఈ తరహా విజయం ఉంటుందో ఉండదోనన్న ఆలోచనల నేపథ్యంలో ఎక్కువ మంది సీనియర్లు ఇప్పుడే మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు విస్తరణలలో కనుక చోటు దక్కించుకోకపోతే.. మరో మూడేళ్ల పాటు విస్తరణ లేదా కూర్పు చేర్పులకు అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జానారెడ్డి కుటుంబానికి ఒక్కటే సీటు అంటూ.. నల్లగొండలో చేసిన వ్యాఖ్యలు.. అదేసమయంలో హైదరాబాద్‌కు అన్యాయం చేస్తున్నారంటూ.. అన్న మాటలు.. మంటలు పుట్టించాయి.
ఇక, ఇప్పుడు ప్రేమ్‌సాగర్ వంతు వచ్చింది. ఇలా అయితే.. రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పైగా.. ఆలస్యమయ్యే కొద్దీ.. పార్టీకి కూడా నష్టమేనన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికి మూడు సార్లు ఇంకేముంది.. విస్తరణ ఖాయమని సంకేతాలు ఇచ్చిన నాయకులు.. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వెయిట్ చేస్తే.. నాయకుల అసంతృప్తి స్థానికంలో కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.