జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపడుతున్న అభివృద్ది పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ అలా చెబుతుంటే.. పనులు ఇలా జరిగిపోతున్నాయి. నిధుల విడుదల, పనుల గుర్తింపు, పనులను కాంట్రాక్టర్లకు అప్పగింత, పనుల ప్రారంభం… అన్నీ ఇట్టే చకచకా జరిగిపోతున్నాయి. ఇందుకు పవన్ ఎంచుకున్న అధికారులే కారణమని చెప్పాలి. కేరళ కేడర్ ఐఏఎస్ అదికారిగా ఉన్న కృష్ణతేజను ఏరికోరి మరీ ఏపీకి రప్పించుకున్న పవన్… ఆయనను తన పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. కృష్ణతేజ కారణంగానే తాజాగా కృష్ణతేజకు తోడుగా మరో సత్తా కలిగిన అధికారిగా గుర్తింపు ఉన్న రేవు ముత్యాల రాజు పవన్ నిర్వహణలోని శాఖలకు బదిలీ అయిపోయారు. ఫలితంగా పవన్ శాఖలు అభివృద్దిలో కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ది శాఖతో పంచాయతీరాజ్, అటవీ, శాస్త్ర, సాంకేతిక రగాల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా సాగుతున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పల్లె సీమలు వృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం వృద్ది సాధించినట్టు అవుతుందన్న భావనతో సాగుతున్న పవన్.. ఆ దిశగా తనదైన శైలి దూకుడు ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే పల్లె పండుగ అంటూ సాగిన పవన్ తాజాగా గిరిజన గూడేల బాగోగుల కోసం అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టారు. పల్లె సీమలకు రహదారి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడం సులభం అన్న భావనతోనే పవన్ ఈ తరహా కార్యక్రమాలను చేపడతున్నారు. పల్లె పండుగకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా…అడవి తల్లి బాటకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఆదివారం ఏపీ ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా ఏపీకి చెందిన ఏపీ కేడర్ లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అదికారి రేవు ముత్యాల రాజును గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ కమిషనర్ గా బదిలీ చేశారు. సివిల్ సర్వీసెస్ లో టాప్ ర్యాంకును సాదించి యావత్తు దేశం దృష్టిని అకర్షించిన రేవు ముత్యాల రాజు ఏపీ కేడర్ నే ఎంపిక చేసుకున్నారు. విద్యార్థి దశలోనే కాకుండా ఐఏఎస్ అదికారి గానూ ముత్యాల రాజు సత్తా కలిగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కారణంగానే అనతి కాలంలోనే జిల్లా స్థాయిలను దాటేసుకుంటూ వచ్చిన ముత్యాల రాజు సీఎంఓలో కీలక స్థాయిలో పనిచేశారు. నిబద్ధతతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ సత్తా కలిగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ముత్యాల రాజు ఇప్పుడు పవన్ శాఖలను పరుగులు పెట్టిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సీఎం అయినా, మంత్రులు అయినా తమకు నచ్చిన అదికారుల కోసం వెతుకుతూ ఉంటారు. తమ అబిప్రాయాలను అర్థం చేసుకుని ముందుకు సాగే అధికారుల కోసం జరిగే అన్వేషణలో ఎలాంటి తప్పు కూడా లేదనే చెప్పాలి. ఆయా శాఖల ద్వారా వేగవంతమైన నిర్ణయాలు, ఫలితాలు సాదించడం ద్వారా అంతిమంగా ప్రజలకే లబ్ధి చేకూరుతుంది కాబట్టి… ఈ తరహా వెతుకులాటను అందరూ స్వాగతిస్తారు కూడా. ఈ క్రమంలోనే ఎక్కడో కేరళలో పనిచేస్తున్న కృష్ణతేజ ను పవన్ ఏరికోరి మరీ ఏపీకి రప్పించుకున్నారు.
తాజాగా ముత్యాల రాజును కూడా పవన్ ఏరికోరి మరీ తన శాఖల కమిషనర్ గా ఎంపిక చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖలను నిర్వహించేది మంత్రులే అయినా… మంత్రుల ఆదేశాలను అమలు చేయాల్సింది అదికారులే కాబట్టి… సమర్థత కలిగిన అదికారులు ఉంటేనే.. ఆయా మంత్రులు తీసుకునే నిర్ణయాలు ప్రజల మనన్నలు పొందుతాయని చెప్పక తప్పదు. ఈ లెక్కన ఓ వైపు కృష్ణతేజ, మరోవపు ముత్యాల రాజులతో పవన్ శాఖలు అభివృద్దిలో పరుగులు పెట్టడం ఖాయమే.