అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా ఆపరేషన్ నడిపినట్టు ఆరోపణలు వచ్చాయి. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఆనంద్ షా రాకెటీరింగ్, గ్యాంబ్లింగ్, మనీల్యాండరింగ్ లాంటి ఆరోపణలకు పాల్పడ్డారని వెల్లడించారు. మొత్తం 39 మందిపై కేసులు నమోదు కాగా, 42 ఏళ్ల ఆనంద్ షా ఆ లిస్టులో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.
రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించి నాలుగు పోకర్ క్లబ్‌లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక ఆధారాలు సేకరించిన తరువాతే కేసులు నమోదు చేశామని తెలిపారు. ఫ్లోరిడాకు చెందిన భారత సంతతికి చెందిన మరో వ్యక్తి సమీర్ ఎస్ నందకర్ణిపై కూడా పోకర్ హోస్ట్‌గా కేసు నమోదు అయింది. ఈ గ్యాంగ్ స్పోర్ట్స్‌బుక్ పేరిట టోర్నీలపై బెట్టింగ్ నిర్వహిస్తూ, 3 మిలియన్ డాలర్లు లావాదేవీ చేసినట్టు తేలింది.
ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమాల్లో మాఫియాను గ్లామరస్‌గా చూపిస్తారు. కానీ వాస్తవంలో అది చట్టాల ఉల్లంఘన. డబ్బు కోసం చట్టాలను తుంగలో తొక్కే వ్యవస్థ ఇది. ఇది నేరం మాత్రమే కాదు… ప్రజల భద్రతకూ ప్రమాదం’’ అని అన్నారు.
ప్రాస్పెక్ట్ పార్క్‌లో రెండోసారి మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచిన ఆనంద్ షా ప్రస్తుతం ఎకనామిక్ డెవలప్మెంట్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై వచ్చిన ఈ ఆరోపణలు అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజంలో కలకలం రేపాయి. ప్రజల నమ్మకాన్ని పొందిన ఓ ఎన్నికైన నాయకుడిపై ఇటువంటి నేర ఆరోపణలు రావడం విచారకరం అని న్యూజెర్సీ అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించారు.