బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి అని.. స్వ‌ర్ణాంధ్ర ప్ర‌దేశ్ సాకార‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ 2047 ఈ ల‌క్ష్యంతోనే తీసుకువ‌చ్చి న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ల‌లోని ప్ర‌ముఖ రామాల‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున శుక్ర‌వారం రాత్రి సీతారా ముల క‌ల్యాణం జ‌రిగింది. వాస్త‌వానికి శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా గ‌త ఆదివారం అన్ని చోట్లా క‌ల్యాణం జ‌రిగితే.. ఒంటిమిట్ట‌లో మాత్రం కొన్నేళ్లుగా.. ఇదే సంప్ర‌దాయం కొన‌సాగుతోంది.

దీంతో ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఒంటిమిట్ట రామాల‌యంలో క‌ల్యాణ క్ర‌తువును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌మిచింది. ఈ కార్య‌క్ర‌మా నికి సీఎం చంద్ర‌బాబు దంప‌తులు హాజ‌రై ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామి, అమ్మ‌వార్ల‌కు.. ప‌ట్టు వ‌స్త్రాలు, త‌లంబ్రాలు స‌మ‌ర్పించారు. క‌ల్యాణ క్ర‌తువును.. టీటీడీ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మం ఆసాంతం చంద్ర‌బాబు దంప‌తులు అక్క‌డే ఉన్నారు. అనంత‌రం.. చంద్ర‌బాబు మాట్లాడుతు.. రాష్ట్రాన్ని రామ‌రాజ్యం చేసే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. పేద‌లులేనిదే రామ రాజ్య‌మ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో తాను కూడా పీ4 విధానం తీసుకువ‌చ్చాన‌ని.. రాష్ట్రంలో పేద‌రికాన్ని సాధ్య‌మైనంత వేగంగా త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలిపారు.

గ‌తంలో భ‌ద్రాచ‌లంలో రామ‌య్య క‌ల్యాణం నిర్వ‌హించే వార‌మ‌ని.. కానీ రాష్ట్ర‌ విభజనతో భ‌ద్ర‌చ‌లం తెలంగాణ‌కు వెళ్లిపోయింద‌ని.. దీంతో ఒంటిమిట్టలో క‌ల్యాణాన్ని నిర్వ‌హించుకుంటున్నామ‌న్నారు. అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకొచ్చామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అదేవిధంగా ఆల‌య ప‌ర్యాట‌క అభివృద్దిలో భాగంగా ఈ ఆల‌యాన్ని కూడా సుంద‌రీక‌రిస్తామ‌న్నారు. ఇక్కడికి ఎవరు వచ్చినా రెండు మూడు రోజలు ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామ‌న్నారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకుంటే.. అదే రామ‌రాజ్యం అవుతుంద‌న్నారు. దీనికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.