కరోనా వేళ.. మరో రంగుల రచ్చలో ఏపీ సర్కార్?

మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. అత్యవసర వేళల్లో అందునా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా అవకాశం ఇవ్వటంతోపాటు..ఏపీ సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఈ మధ్యనే పంచాయితీ కార్యాలయాలకు ఏపీ అధికారపక్ష జెండా రంగుల్ని పోలి ఉండేలా రంగులు వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కాసిన్ని చురకలు వేయటమే కాదు.. రంగుల్ని మార్చాలంటూ ఆదేశాల్ని జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలోని అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగుల్ని వేశారన్న ఆరోపణలు ఇప్పుడు షురూ అయ్యాయి. ఈ వాదనకు బలం చేకూరేలా ఏపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులు వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలోని మెడికల్ కాలేజీలో కొన్ని అంబులెన్సుల్ని ఉంచారని.. వాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయటానికి ఉంచారన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీకీ రంగుల పిచ్చి ఏమిటంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ పబ్లిసిటీ పిచ్చేమిటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఆయన ఒక పోస్టును సంధించారు.
ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఈ తరహా రంగుల రచ్చకు ఏపీ అధికారపక్షం ఎందుకు అవకాశం ఇస్తుందన్నది ప్రశ్నగా మారింది. మరి.. ఈ ఆరోపణకు ఏపీ అధికారపక్షం ఎలాంటి బదులు ఇస్తుందో చూడాలి?