“మీరు చెబుతున్న మాటలను బట్టి.. మీరు అడుగుతున్న గడువును బట్టి.. బీఆర్ఎస్ సభను నిర్వహించరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మేం భావించేలా చేస్తున్నారు” అని తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. తాజాగా బీఆర్ ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండనున్నాయి. ఈ నెల 27 నాటికి బీఆర్ ఎస్ పార్టీ స్థాపించి పాతిక సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా, ఎల్కతుర్తిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సహా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ ఎస్ నిర్ణయించింది.
ఈ క్రమంలో సభ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు తదితర అంశాలకు సంబంధించి వరంగల్ పోలీసులను అభ్యర్థించింది. అయితే.. ఈ కార్యక్రమాలకు.. పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు.. ప్రస్తుతం పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని.. కాబట్టి ఇలాంటి పార్టీ కార్యక్రమాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అయితే.. పోలీసుల వైఖరిని బీఆర్ఎస్ నేతలు.. హైకోర్టలో సవాల్ చేశారు. తమ సభకు అనుమతించడం లేదని..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగిన హైకోర్టు.. పోలీసుల వైఖరిని తప్పుబట్టింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందని.. ఇది రాజ్యాంగ బద్ధంగా వారికి లభించిన హక్కు అని పేర్కొనడం గమనార్హం. అదేసమయంలో పోలీసులు, యంత్రాంగం.. కూడా పార్టీలకు అతీతంగా సహకారం అందించాలని.. ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న కారణంగా.. తప్పించుకునే వీలులేదని పేర్కొంది.
ఈ సమయంలో తమకు 21వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మరింత తీవ్రంగా స్పందిస్తూ.. “వారేమో(బీఆర్ ఎస్) ఈ నెల 27న సభ పెడతామని చెబుతున్నారు. మీరేమో 21వ తేదీ వరకు గడువు కోరుతున్నారు. మీ వైఖరి చూస్తే.. వారిని సభ నిర్వహించుకోరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మాకు అనిపిస్తోంది” అని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.