జ‌గ‌న్ అంటే భ‌క్తా? భ‌య‌మా? నాట‌క‌మా?

మంత్రిగా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. మీరే స‌ర్వ‌స్వం అనుకోవ‌ద్దు. కుటుంబాన్ని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచండి. మీమీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ స‌మ‌యం ఉండ‌డం. అవ‌స‌రం ఉంటేనే తాడేప‌ల్లిలో ఉండండి– ఇదీ త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి మండ‌లి స‌భ్యుల‌కు చెబుతున్న మాట‌లు. దీనికి మంత్రులు అందరూ కూడా ఓకే బాస్‌ అంటున్నారు. విన‌యం చూపిస్తున్నారు.. ఆయ‌న ద‌గ్గ‌ర మంచిమార్కులు ప‌డుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం ఎవ‌రి దారిలో వారు న‌డుస్తున్నారు.

దీంతో మంత్రుల తీరు వేరేగా ఉందే. అనే చ‌ర్చతోపాటు.. జ‌గ‌న్ అంటే.. వీరికి భ‌క్తా? భ‌య‌మా? లేక నాట‌కం ఆడుతున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. గ‌తంలో ఆమె వెంట ఆమె సోద‌రుడు.. భ‌ర్త ఉండేవారు. ఆమె పైకి మంత్రి అయినా.. కార్య‌క్ర‌మాల‌న్నీ.. ఆమె భ‌ర్త క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచేవ‌నే పేరుంది. దీంతో ఒక‌సారి మౌఖికంగానే జ‌గ‌న్ ఈ విష‌యాన్ని హెచ్చ‌రించారు. ఎక్క‌డికి వెళ్లినా.. ఒంట‌రిగావెళ్లండి.. కుటుంబ స‌భ్యుల‌ను తీసుకువెళ్లకండి అని సూచించారు. ముందు ఊ అన్న స‌ద‌రు మంత్రి… కొన్నాళ్లు ఎటూ వెళ్ల‌కుండా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

మ‌ళ్లీ ఇటీవ‌ల కాలంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే.. య‌థాత‌థంగా గ‌తంలో మాదిరిగానే భ‌ర్త‌ను వెంటేసుకుని తిరుగుతున్నారు. అన్నా మీరు మీ శాఖ విష‌యాన్ని చూసుకోండి అని ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన ఓ మంత్రికి జ‌గ‌న్ సూచించారు. ఈ విష‌యంలో దాప‌రికం లేకుండానే కొన్ని సూచ‌న‌లు సైతం చేశారు. ఆయ‌న కూడా ముందు ఊ.. అన్నారు. కొన్నాళ్లు ఆయ‌న కూడా ఇంటికే ప‌రిమిత‌మై.. నాకెందు కు.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. మ‌ళ్లీ గ‌త నెల నుంచి త‌న‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరు గుతున్నారు. పోనీ.. మంత్రిగా తిరిగే స్వేచ్ఛ ఉన్నా.. స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు స‌మాచారం ఇవ్వ‌డం లేదు. దీంతో ఇది మ‌ళ్లీ వివాదానికి దారితీస్తోంది.

ఇక‌, టిక్‌టాక్‌ల‌తో ఇర‌గ‌దీసిన డిప్యూటీ సీఎం ఒక‌రికి జ‌గ‌న్ బాగానే త‌లంటార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. పార్టీలో ఏవైనా లోపాలుంటే.. మీరే చెప్పండి. మీ కుటుంబ స‌భ్యులు విమ‌ర్శిస్తున్నా.. కౌంట‌ర్ ఇవ్వ‌లేరా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించిన‌ట్టు సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేసింది. ఏమైందో ఏమో.. ఆ నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆమె ఎక్క‌డా క‌నిపించ‌డం మానేశారు. జ‌గ‌న్ చెప్పింది.. ఇంట్లో కూర్చోమ‌నా.. మార్పు కావాల‌నా? అనే ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు.

త‌న సొంత జిల్లాకే చెందిన మంత్రి దూకుడు చూపించ‌లేక పోతున్నార‌ని.. జ‌గ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన్నా మీ క‌మ్యూనిటీకి మ‌నం ఎన్నో చేస్తున్నాం. మీరు ప్ర‌చారం చేయాలి! అని సూచించారు. స‌రే సార్‌.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తా అని స‌ద‌రు మంత్రివ‌ర్యులు చెప్పారు. అలా చెప్పారే త‌ప్ప‌.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప గ‌డ‌ప దాటింది లేదు. అన్నా నువ్వు దూకుడు త‌గ్గించాలి. ఈ విమ‌ర్శ‌లు ఎందుకు? అని కృష్ణాజిల్లా మంత్రి గారికి సీఎం హిత‌వు ప‌లికారు. దీంతో ఓ వారం ప‌ది రోజులు ఆయ‌న మీడియా ముందుకు రాలేదు. త‌ర్వాత ఏమ‌న‌కున్నారో.. ఏమో.. వ‌చ్చీరావ‌డంతోనే వాడు వీడు.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిపై విరుచుకుప‌డ్డారు. అంతే.. మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల ప‌ర్వం స్టార్ట్‌.

ఇలా.. దాదాపు ప‌దిహేను మంది మంత్రులు.. జ‌గ‌న్ చెబుతున్న‌ది వింటున్నారు.. ఓకే అంటున్నారు.. బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. కొన్నాళ్లు మౌనం వ‌హిస్తున్నారు.. త‌ర్వాత తాము చేయాల్సింది చేస్తున్నారు. దీనిని చూస్తే.. జ‌గ‌న్ అంటే వీరికి భ‌క్తా? భ‌య‌మా? లేక నాట‌కాలు ఆడుతున్నారా? అనే సందేహం స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.