జ‌గ‌న్ స‌తీమ‌ణిపై దుర్భాష‌లు.. టీడీపీ నేత‌పై బాబు క‌ఠిన చ‌ర్య‌లు

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. త‌న పార్టీవారిని కూడా వ‌దిలి పెట్ట‌డం లేదు. పార్టీ నాయ‌కులు త‌ప్పులు చేసినా.. వారిని ఉపేక్షించ‌డం లేదు. అరెస్టు చేయాల‌ని.. పోలీసుల‌ను సైతం ఆదేశిస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై నోరు పారేసుకున్న టీడీపీ నాయ‌కుడిపై చంద్ర‌బాబు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆయ‌న‌పై కేసు పెట్టాల‌ని టీడీపీ నాయ‌కుల‌నే ఆదేశించారు.

ఏం జ‌రిగింది?

ఐ-టీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్.. కొన్నేళ్లుగా టీడీపీలో ప‌నిచేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ప‌నిచేశారు. అయితే.. ఆయ‌న తాజాగా వైఎస్ భార‌తిపై తీవ్ర వ్యాఖ్య‌లు విసిరారు. మ‌హిళ‌లను అవ‌మానించేలా వ్యాఖ్యానిస్తూ.. దూష‌ణ‌ల‌కు దిగారు. ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పోలీసుల‌పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తూ.. చేసిన వివాస్ప‌ద వ్యాఖ్య‌లు టీడీపీ దృష్టికి వెళ్లాయి.

అంతే.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. చంద్ర‌బాబు స‌ద‌రు కిర‌ణ్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అంతేకాదు.. ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసి త‌క్ష‌ణ‌మే కేసు న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గుంటూరు పార్టీ కీల‌క నాయ‌కుల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. దీంతో వారు గుంటూరు పోలీసుల‌కు పిర్యాదు చేశారు. దీనిపై కేసు క‌ట్టిన పోలీసులు చేబ్రోలు కిర‌ణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌పై సామాజిక మ‌ధ్యమాల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు.. చంద్ర‌బాబు దీనిపై స్పందిస్తూ.. మ‌హిళ‌ల‌ను కించ ప‌రిస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని వ్యాఖ్యానించారు. మ‌హిళ‌లు ఎవ‌రైనా మ‌హిళ‌లేన‌ని.. త‌మ ప్ర‌భుత్వం వారి గౌర‌వాన్ని ఏమాత్రం త‌గ్గించేలా వ్య‌వ‌హ‌రించినా.. త‌గిన విధంగా స్పందిస్తుంద‌ని పేర్కొన్నారు.