మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పనిసరిగా అమర్చుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఈ మేరకు రవాణాశాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 30వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. అందులోగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్ బిగించనివారు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ వల్ల వాహన దొంగతనాలను, నకిలీ నంబర్ల వాడకాన్ని నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఇది రోడ్డు భద్రతకూ ఎంతో మేలుకాలిగిస్తుందని తెలిపారు. ఇప్పటికే 2019 తర్వాత తయారైన వాహనాలపై ఈ నిబంధన అమలులో ఉంది. కానీ ఇప్పుడు పాత వాహనాలకూ తప్పనిసరి చేశారు.
దీని ధర వాహన రకాన్ని బట్టి మారుతుంది. ద్విచక్ర వాహనాలకు ₹320-₹380 వరకు, కార్లకు ₹590-₹700 వరకు, ట్రక్కులు, కమర్షియల్ వాహనాలకు ₹600-₹860 వరకు ధరలు నిర్ణయించారు. ఇంటికే వచ్చి ప్లేట్ అమర్చినట్లయితే అదనపు ఛార్జీ వసూలు చేయవచ్చని తెలిపారు. వాహన యజమానులే తమ వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చుకోవాల్సిన బాధ్యత వహించాలి.
అది లేకపోతే వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్‌లను పొందడం సాధ్యం కాదు. రవాణా కార్యాలయంలో పేరుమార్చాలన్నా, వాహనం అమ్మాలన్నా ఈ ప్లేట్ తప్పనిసరి. గడువు తర్వాత బోర్డు లేకుండా తిరిగితే నేరుగా కేసు నమోదు చేస్తారు. వాహనదారులు www.siam.in వెబ్‌సైట్ ద్వారా తమ వాహన వివరాలు నమోదు చేసి, నంబర్ ప్లేట్‌ను బుక్ చేసుకోవాలి. బిగించిన తర్వాత ఫొటోను అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇక ఆలస్యం ఎందుకు? మీరు నడిపే వాహనం చట్టబద్ధంగా ఉండాలంటే వెంటనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్ బిగించండి.