సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుతున్న సదరు పాఠశాల భవంతిలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించగా.. అందులో ఓ బాలుడు చనిపోయాడు. అంతేకాకుండా పవనోవిచ్ తో పాటు 15 మంది పిల్లలు గాయపడ్డారు. ఈ లెక్కన ఈ ప్రమాదాన్ని పెద్దదిగానే పరిగణించక తప్పదు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు పవన్ కుమారుడి కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అయితే అగ్ని ప్రమాదం కారణంగా భవంతిలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఫలితంగా ఈ పొగ పీల్చిన కారణంగా పవనోవిచ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.
పవన్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన వార్త ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ క్షణాల్లో వైరల్ అయ్యింది. పలువురు రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ పవన్ కు సందేశాలు పంపడంతో పాటుగా ప్రమాదం గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడి పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు మరింతగా ఆసక్తి కనబరచారు. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఓ పోస్టు పెట్టారు. ప్రమాదంలో ఎడున్నరేళ్ల వయసున్న పవనోవిచ్ గాయపడటం అందరినీ కలచివేసింది. అది కూడా చదువుకునేందుకు సింగపూర్ వెళ్లిన పవనోవిచ్… అక్కడి పాఠశాలలో గాయపడటం నిజంగానే అందరినీ కలవరపాటుకు గురి చేసింది.
ఇదిలా ఉంటే… ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసిన సమయానికే పవన్ అరకులో తన రెండో రోజు పర్యటనను మొదలుపెట్టారు. ఫలితంగా తన కోసం గిరిజనులు వేచి చూస్తుంటారని వ్యాఖ్యానించిన పవన్… పర్యటన ముగిసిన తర్వాతే సింగపూర్ వెళతానని చెప్పారు. అనుకున్నట్లుగానే తన పర్యటనను ముగించుకుని హుటాహుటీన విశాఖ చేరుకున్న పవన్ ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరారు. మరోవైపు పవనోవిచ్ కు జరిగిన ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి… ఈ ప్రమాాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకుని పవనోవిచ్ కు చిన్నపాటి గాయాలే అయ్యాయని కాస్తంత కుదుటపడ్డారు. అయితే తన సతీమణితో కలిసి ఆయన మంగళవారం రాత్రికే సింగపూర్ వెళుతున్నారు. మొత్తంగా పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురయ్యారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates