జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఇలాంటి కష్ట సమయంలో పవన్ కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు జగన్ అభిలషించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జగన్ ఓ ఆసక్తికర సందేశాన్ని పోస్టు చేశారు. అందులో పవన్ ను ‘పవన్ గారు’ అంటూ జగన్ సంబోధించడం గమనార్హం. నిత్యం పవన్ పై రాజకీయంగా విరుచుకుపడే జగన్ నుంచి పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసినంతనే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల కావడం గమనార్హం.
ఏడున్నరేళ్ల వయసున్న పవన్ కుమారుడు పవనోవిచ్ సింగపూర్ లో ప్రైమరి విద్యనభ్యసిస్తున్నారు. అందుకోసం పవన్ సతీమణి అన్నా లెజినోవా సింగపూర్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పవనోవిచ్ చదవుతున్న పాఠశాలలో ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పవనోవిచ్ తో పాటు మరికొందరు పిల్లలు పాఠశాలలోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో పవనోవిచ్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మంటల కారణంగా ఎగసిన పొగను పీల్చిన కారణంగా పవనోవిచ్ శ్వాస సంబంధిత ఇబ్బందికి కూడా గురయ్యారు. వేగంగా స్పందించిన సింగపూర్ అధికారులు సహాయక చర్యలను చేపట్టి… పాఠశాలలోని పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవనోవిచ్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. పవన్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారని తెలిసిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు. అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన విషయం తనను ఆందోళనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన అభిలషించారు. మరోవైపు పవన్ కుమారుడు గాయపడ్డ విషయం తెలిసినంతనే అందరికంటే ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ వేగంగా స్పందించారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ అన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారన్న విషయం తనను షాక్ కు గురి చేసిందని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, కష్ట కాలంలో ఉన్న పవన్ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన అభిలషించారు.