జగన్ చేసిన తప్పుకు బాబును నిలదీసిన షర్మిల

ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు మొక్కుబడిగా కొంత మొత్తం చెల్లించినటప్పటికీ బకాయిలు మాత్రం పూర్తిగా క్లియర్ కాలేదు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఈ భారం పడింది. ఇంకా దాదాపు 3500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. దీంతో, తాజాగా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు నేటి నుంచి ఆరోగ్య శ్రీ కింద అందించే వైద్య సేవలు నిలిపివేశాయి.

ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయలేదంటూ కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. వైద్య సేవలు ఆపే దాకా ఎదురు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయిందని, ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీగా మారిందని విమర్శించారు. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదని ఎద్దేవా చేశారు. పేదోడి ఆరోగ్యానికి భరోసా లేదని, ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 9 నెలలుగా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. ఏపీని వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు చెప్పారని, ముందు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని అన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదని షర్మిల చెప్పారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి తక్షణమే వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

అయితే, షర్మిల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అన్న జగన్ హయాంలో 2500 కోట్ల రూపాయల బకాయిలున్నాయని, వాటిపై షర్మిల ఏనాడూ ప్రశ్నించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఐదేళ్లు సైలెంట్ గా ఉన్న షర్మిల…ఇప్పుడు పది నెలల కూటమి పాలనను తప్పుబట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. తన తండ్రి ప్రారంభించిన పథకంపై అన్న జగన్ ను ఆనాడు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు.