అప్పుడు ఫైబ‌ర్ నెట్ ఇప్పుడు శాప్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాదికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ ర‌వినాయుడు.. వ‌ర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య ఇప్పుడు రాజ‌కీయం జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి రోజా నేరుగా ర‌వి నాయుడిని టార్గెట్ చేయ‌లేదు. కానీ, చంద్ర‌బాబు పైనా.. మంత్రి నారా లోకేష్‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిని తిప్పికొడుతూ.. ర‌వి నాయుడు.. రోజాపై నిప్పులు చెరిగారు. అరెస్టు చేసేందుకు వారెంటు చాల‌ని.. ద‌మ్ముతో ప‌నిలేద‌ని అన్నా రు. అంతేకాదు.. రోజా వ‌ల్లే వైసీపీ 11 స్థానాల‌కు దిగ‌జారిపోయింద‌ని కూడా ఎద్దేవా చేశారు.

అయితే.. వాస్త‌వానికి ర‌వి నాయుడు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రోజాపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. శాప్‌లో రోజాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చి దాదాపు మూడు నెల‌లు అయింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు దీనిపై ఎలాంటి ఫిర్యాదు న‌మోదు చేయ‌లేదు. కానీ.. ఇప్పుడు రోజా కేంద్రంగా ర‌వి నాయుడు దుమ్ము రేపారు. అయితే.. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు స‌రికాద‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.

గ‌తంలో ఫైబ‌ర్ నెట్ వ్య‌వ‌హారం మాదిరిగానే ఇప్పుడు శాప్‌కూడా మారింద‌ని టీడీపీకి చెందిన కీల‌క నాయ కుడు ఒక‌రు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. ఫైబ‌ర్ నెట్‌లో అవినీతి జ‌రిగింద‌ని.. అధికారులు త‌న మాట వినిపించుకోవ‌డం లేద‌ని.. అప్ప‌ట్లో జీవీ రెడ్డి వ్యాఖ్యానించి.. త‌ర్వాత  రాజీనామా కూడా చేశారు. ఇక‌, ఇప్పుడు శాప్ వ్య‌వ‌హారం కూడా ఇలానే ఉంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం. కానీ, దీనిని పైకి చెప్ప‌కుండా.. ర‌వి నాయుడు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రోజాను కార్న‌ర్ చేసుకుని.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు 119 కోట్ల రూపాయ‌ల‌ను ఆమె దోచుకున్నార‌ని ర‌వి నాయ‌కుడు చెప్ప‌డం చూస్తే.. అధికారుల‌పై ఆయ‌న నోరు మెద‌ప‌లేక‌.. ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నా ర‌న్న చ‌ర్చ వ‌స్తోంది. వాస్త‌వానికి అవినీతి జ‌రిగింద‌న్న‌ది టీడీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు. సీఎం చంద్ర‌బాబు కూడా.. ఆడుదాం ఆంధ్ర కార్య‌క్ర‌మంద్వారా పెద్ద ఎత్తున అవినీతిజ‌రిగింద‌న్నారు. కానీ, అప్ప‌టి అధికారులే ఇప్పుడు కూడా ఉండ‌డం.. వారిపై ర‌వినాయుడు సీరియ‌స్ కాలేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో ఇప్పుడు రోజా వ‌ర్సెస్ ర‌వినాయుడుఅన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింద‌ని టీడీపీ నాయ‌కులే వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.