రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమ‌రావ‌తిని క‌నెక్ట్ చేయ‌డం లేదు. దాదాపు 50 కిలో మీట‌ర్ల మేర‌కు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం.. అమ‌రావ‌తికి నేరుగా క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది.

దీనిలో భాగంగా తెలంగాణ నుంచి వ‌చ్చే వారి కోసం.. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం- గుంటూరు జిల్లా నంబూరుల మ‌ధ్య కొత్త రైలు లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా రావ‌డంతో ఇప్పుడు చ‌క‌చ‌కా ప‌నులు ప్రారంభించేందుకు స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో  అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ భూముల్లో నంబూరులోని కొంత వ‌ర‌కు.. ప్ర‌భుత్వ స్థలం ఉంది. దీంతో భూసేక‌ర‌ణ‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని భావిస్తున్నారు.

ఇక‌, తెలంగాణ నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు రాకుండానే ఖ‌మ్మంలోని ఎర్రుబాలెం మీదుగా.. కృష్ణా నదిపై కొత్త‌గా నిర్మించే వంతెన ద్వారా.. రాజ‌ధానిలోకి వ‌చ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 57 కిలో మీట‌ర్లు ఉండగా.. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న దూరం కూడా 50 కిలో మీట‌ర్ల మేర‌కు త‌గ్గ‌నుంది. మొత్తంగా 450 కోట్ల మేర‌కు ఈ నిర్మాణానికి ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. దీనిలో ఒక్క కృష్ణాన‌దిపై నిర్మించే వంతెన‌కే.. రూ.350 కోట్లు ఖ‌ర్చుకానున్నాయి. వీటిని ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన నిధుల నుంచి కేటాయించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.