అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్… దేశంలోని చాలా ప్రాంతాల్లో జనం రోడ్ల మీదకు వచ్చేశారు. హ్యాండ్సప్ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో లక్షలాది మంది అమెరికా పౌరులు నిరసనలకు దిగారు. ఫలితంగా అమెరికాలోని కీలక నగరాలు నిరసనలు, నిదాలతో హోరెత్తిపోతున్నాయి. ఈ నిరసనల ఏరియల్ వ్యూ దృశ్యాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలి నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. పౌరసత్వం సహా విదేశాలపై సుంకాల విధింపుతో ట్రంప్ నిజంగానే ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్నారు. ఈ చర్యల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ తరహా పరిస్థితి తనకూ తెలుసునన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం వచ్చినా ఫరవా లేదన్నట్లుగా ఆయన సాగుతున్న తీరు నిజంగానే అమెరికా పౌరులను అభద్రతా భావంలోకి నెట్టేసింది.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న చర్యలపై అటు విదేశీయులతో పాటుగా స్వదేశీయుల్లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా వివిధ దేశాలపై సుంకాల వడ్డింపు, ఫలితంగా ఆయా దేశాలు అమెరికాపై విధిస్తున్న సుంకాలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోత.. ఫలితంగా అమెరికా వాసుల్లో అభద్రతా భావం కాస్తా నిరసనగా మారిపోయింది. వెరసి జనం రోడ్డెక్కేశారు. వాషింగ్లన్, న్యూయార్క్ నగరాలతో పాటు నార్త్ కరోలినా, మాసాచుసెట్స్ వంటి ప్రాంతాల్లోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates