రాష్ట్రపతి ఆమోదం… చట్టంగా వక్ఫ్ సవరణ బిల్లు

వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి సంతకం ద్వారా మిగిలి ఉన్న ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఫలితింగా దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు అయ్యింది. రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లుపై సంతకం చేసిన మరుక్షణమే అది చట్టంగా మారి ఏకంగా అమల్లోకి వచ్చేసింది.

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రూపొందించిన ఈ బిల్లుకు దేశంలోని పలు ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తంగా చేయగా… చాలా ముస్లిం సంఘాలు ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అవసరమైన సవరణలను చేసేందుకు సిద్ధపడిన కేంద్రం సంయుక్త పార్లముంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలం పాటు క్రమానుగతంగా ఈ బిల్లుపై జేపీసీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ప్రతిపాదించిన సవరణలపై విస్తృత చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మెజారిటీ వర్గాల అభిప్రాయాల మేరకు సవరణలను కూడా ఆమోదించింది.

అనంతరం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు దశలో కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం లోక్ సభలో జరిగిన ఓటింగ్ లో 288-232 ఓట్లతో, రాజ్యసభలో 128-95 ఓట్లతో ఆమోదం లభించింది. అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా… రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును పరిశీలించి శనివారం రాత్రి తన ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా యావత్తు దేశంలో ఆసక్తి రేకెత్తించిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయి… అమల్లోకి వచ్చేసింది.