బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వచ్చేసిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకపుడు రెండు పార్టీల నేతలు చేతిలో చేయి వేసుకుని ప్రయాణించినా ఇపుడు మాత్రం అంత సీన్ లేదనే అనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాతే గ్యాప్ మొదలైనట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్న కాలంటో ఇటు కన్నా అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకతాటిపై నడిచిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ ఏమి చేసినా తప్పే, చివరకు ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా ఉండేది కన్నా వ్యవహారం. దానికి పవన్ కూడా వంత పాడేవారు.

కానీ వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్ను గుడ్డిగా వ్యతిరేకించకుండా అంశాల వారీగా మాత్రమే ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. ఇదే సందర్భంలో టీడీపీనే తమకు ప్రథమ శతృవంటూ ప్రకటించేశారు. దాంతో చంద్రబాబునాయుడు అండ్ కో పై వీర్రాజు అండ్ కో సమయం వచ్చినపుడల్లా రెచ్చిపోతున్నారు. ఈ విషయంలోనే కమలం పార్టీతో పవన్ కు గ్యాప్ మొదలైందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకపుడు ప్రధానమంత్రి ఏమి మాట్లాడినా, ట్వీట్లను పెట్టిన పవన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానో లేకపోతే జనసేన ట్విట్టర్ ద్వారానో బాగా ఫార్వాడ్ చేయించేవారు. కొద్ది రోజులుగా అలాంటివి ఆపేశారట.

ఇక తాజాగా దుబ్బాక ఉపఎన్నికల విషయంలో పెరిగిపోయిన గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉపఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా లేదా అన్నది వేరేసంగతి. గెలుపే లక్ష్యంగా కమలంపార్టీ పావులు కదుపుతోంది. అయితే ఉపఎన్నికల్లో ఇంతవరకు పవన్ తొంగిచూడలేదు. ఉపఎన్నికల్లో ప్రచారానికి రావాలని బిజేపీ నేతలు ఆహ్వానించినా పవన్ వెళ్ళలేదట. ఎందుకంటే ఉపఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తే కేసీయార్ తో గొడవకు దిగినట్లవుతుంది.

మిత్రపక్షంగా బీజేపీ తరపున ప్రచారం చేయాల్సొస్తే తాను కూడా కేసీయార్ నే టార్గెట్ చేయాల్సొస్తుంది. ఆపని చేయటం పవన్ కు ఇష్టం లేదట. అందుకనే ఉపఎన్నికల ప్రచారానికి రమ్మని పిలిచినా వెళ్ళలేదని చెబుతున్నారు. దీనికితోడు వర్షాలతో దెబ్బతిన్న జిల్లాల్లో కూడా రెండు పార్టీల నేతలు ఎవరికి వారుగానే పర్యటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏపిలో బీజేపీ కార్యాలయం ఓపెన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ కార్యాలయం ప్రారంభానికి కమలనాధులు అసలు పవన్ కు ఆహ్వానమే పంపలేదట. కారణాలు ఏవైనా కానీ రెండు పార్టీల మధ్య గ్యాప్ అయితే పెరిగిపోతోందనే విషయం అర్ధమైపోతోంది. మరి గ్యాప్ ఇంకా పెరిగిపోతుందా ? లేకపోతే ప్యాచప్ అవుతుందా ? అన్నది కాలమే నిర్ణయించాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)