నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఇక శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో అసెంబ్లీ, హైకోర్టుల నిర్వహణ కోసం తాత్కాలిక భవన సముదాయాలను నాటి టీడీపీ ప్రభుత్వం నిర్మించగా… తాజాగా టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు… అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాల కోసం ఏపీసీఆర్డీఏ ఇటీవలే టెంటర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను సీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఖరారు చేశారు.
హైకోర్టు శాశ్వత భవన సముదాయం కోసం రూ.924.64 కోట్లతో సీఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసి టెండర్లు పిలవగా… నిర్మాణ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరుప్రఖ్యాతులు గడించిన తెలుగు నేలకు చెందిన నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్సీసీ) బిడ్ ను దాఖలు చేసింది. ఇక అసెంబ్లీ శాశ్వత భవన సముదాయం నిర్మాణం కోసం రూ.724.69 కోట్లతో సీఆర్డీఏ టెండర్లను పిలవగా… నిర్మాణ రంగంలోనే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీగా ప్రసిద్ధి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ (ఎల్ అండ్ టీ) తన బిడ్ ను దాఖలు చేసింది.
ఈ రెండు శాశ్వత భవన నిర్మాణాల కోసం కేవలం రెండు సంస్థలే బిడ్డింగ్ లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం బిడ్లను ఓపెన్ చేసిన సీఆర్డీఏ అధికారులు.. ఒక్కో భవన నిర్మాణానికి ఒక్కొక్క బిడ్ మాత్రమే దాఖలు కావడంతో ఆయా సంస్థ లకు టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎన్సీసీ దక్కించుకోగా… అసెంబ్లీ భవన నిర్మాణం కాంట్రాక్టును ఎల్ అండ్ టీ దక్కించుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారికంగా టెండర్ల ఖరారు ను శుక్రవారం ఖరారు చేసింది. మొత్తంగా ఈ రెండు భవన నిర్మాణాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,649.33 కోట్లను వెచ్చించనుంది. త్వరలోనే ఈ భవనాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.