‘వ‌క్ఫ్’ బిల్లు.. ఇక‌, సుప్రీం వంతు.. బిహార్‌లో అల‌జ‌డి!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీసుకు వ‌చ్చిన వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024 పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఆమోదం పొందింది. దీనికి ముందు సుదీర్ఘ‌కాలం క‌స‌ర‌త్తు చేసిన కేంద్రం.. అన్ని రాష్ట్రాల‌ను దాదాపు ఒప్పించే ప్ర‌య‌త్నం చేసింది. మరీ ముఖ్యంగా ఎన్డీయే భాగ‌స్వామ్య పార్టీల‌ను క‌దిలించింది. నిజానికి ఈ ద‌ఫా ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలుగా.. లౌకిక వాద పార్టీలుగా ముద్ర వేసుకున్న జేడీయూ(బిహార్ అధికార పార్టీ), టీడీపీ(ఏపీలో కూట‌మి పార్టీ)లు ఉన్నాయి. దీంతో ఈ బిల్లు కొంత క‌ష్టాలు ఎదుర్కొంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, మోడీ లౌక్యం, కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యూహాలు ఫ‌లించాయి.

దీంతో వ‌క్ఫ్ బిల్లు ఒకింత ఎదురీత‌లు వ‌చ్చినా.. ఉభ‌య స‌భ‌ల్లోనూ పాస్ అయిపోయింది. అయితే.. ఇప్పుడు అస‌లు విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. పార్ల‌మెంటులో బిల్లు పాస్ అవ‌డం బాగానే ఉన్నా.. దీనిని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసేందుకు చాలా పార్టీలే రెడీ అయ్యాయి. వీటిలో కీల‌క‌మైన కాంగ్రెస్ పార్టీ, హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎంలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాయి. శుక్ర‌వారం సాయంత్రం ఈ రెండు పార్టీలు.. మ‌రికొన్ని మైనారిటీ పార్టీల‌ను జ‌త క‌లుపుకొని సుప్రీంకోర్టు మెట్టెక్కాయి. వ‌క్ఫ్ బిల్లును బ‌ల‌వం తంగా తీసుకువ‌చ్చార‌ని.. దీనిని ప‌విత్ర‌త లేద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. రాజ్యాంగ నియ‌మాల‌ను కూడా ఉల్లంఘించార‌ని పిటిష‌న్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స‌హా ప‌లువురు నాయ‌కులు సుప్రీం లో వేసిన పిటిష‌న్‌పై సంత‌కాలు చేశారు. బిల్లులోని నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించార‌ని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14 అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని.. కానీ, ఈ ఆర్టిక‌ల్ను కూడా తోసిపుచ్చుతూ.. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును రూపొందించార‌ని పేర్క‌న్నారు. దీంతో వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణ వ్య‌వ‌హారాలు ఏక‌ప‌క్షంగా ఉంటాయ‌ని.. ఇది ల‌క్షలాది మంది మైనారిటీ ముస్లింల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొన్నారు. వ‌క్ఫ్‌కు ద‌శాబ్దాలుగా ఉన్న అటాన‌మ‌స్ (స్వయంప్రతిపత్తి) దెబ్బ‌తింటుంద‌ని పేర్కొన్నారు. ఈ పిటిష‌న్ శ‌నివారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

నితీష్‌కు కీల‌క నేత‌ల గుడ్ బై!

మ‌రోవైపు బిహార్ అధికార పార్టీ జేడీఎస్‌లో నాయ‌కులు పార్టీకి రాజీనామాలు స‌మ‌ర్పించారు. వ‌క్ఫ్ బిల్లును న‌ల్ల‌చ‌ట్టంతో పోల్చిన నాయ‌కులు ఈ విష‌యంలో నితీశ్ త‌మ ఆశ‌ల‌ను అడియాస‌లు చేశార‌ని పేర్కొన్నారు. ల‌క్ష‌లాది మంది ముస్లింలు.. నితీష్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు .. లౌకిక శ‌క్తిగా భావించి.. ముందుకు సాగార‌ని, కానీ, ఆయ‌న ఇప్పుడు బీజేపీ మాయ‌లో ప‌డి.. ముస్లింల గొంతు కోస్తున్నార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో తాము జేడీయూలో ఉండ‌లేమ‌ని తెగేసి చెప్పారు. ఈ మేర‌కు ఐదుగురు కీల‌క నాయ‌కులు పార్టీకి రాజీనామాలు స‌మ‌ర్పించారు.