ప‌ని మొదలు పెట్టిన నాగ‌బాబు..

జ‌న‌సేన నాయ‌కుడు.. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజ‌యం ద‌క్కించుకున్న కొణిద‌ల నాగ‌బాబు.. రంగంలోకి దిగిపోయారు. త‌న సోద‌రుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో నిర్వ‌హిస్తున్న ప‌లు అధికారికా కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటున్నా రు. అయితే .. గ‌తంలోనూ ఆయ‌న ఇక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా.. అప్ప‌ట్లో ఎలాంటి ప్రొటోకాల్ లేదు. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ కావ‌డంతో ఆ ప్రొటోకాల్ ప్ర‌కారం.. నాగ‌బాబు స‌ద‌రు కార్య‌క్ర‌మాల్లో పాల్గొ న‌డం గ‌మ‌నార్హం.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేపట్టిన విష‌యం తెలిసిం దే. శుక్రవారం ఉదయం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన నాగ‌బాబు.. స్థానిక గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధి లో రూ. 88.98 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను జ‌న‌సేన పార్టీకే చెందిన కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రారంభించారు.

ఈ సౌక‌ర్యాల‌తో పిఠాపురం ప్ర‌జ‌ల‌కు అధునాతన వైద్యం అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఈ సంద‌ర్భంగా నాగబాబు వ్యాఖ్యానించారు. త‌మ‌కు రాజ‌కీయాలు ముఖ్యం కాద‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు వ‌చ్చామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పిఠాపురం త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కంచుకోట‌గా మారింద‌న్నారు. త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌లే కాదు.. ఎప్పుడు ఎలాంటి ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఇక్క‌డ గెలుపు జ‌న‌సేన‌దేన‌ని నాగ‌బాబు చెప్పుకొచ్చారు.

కాగా.. ఇది అధికారిక కార్య‌క్ర‌మం కావ‌డంతో టీడీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను కూడా ఆహ్వానించా రు. ఇక‌, టీడీపీ మ‌రో నేత‌, ప‌వ‌న్ కోసం సీటును త్యాగం చేసిన వ‌ర్మ‌కు మా్త్రం ఎలాంటి పిలుపు అంద‌లేద నిఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. దీనిపై వారు ఆగ్ర‌హంతో ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మం కాద‌ని.. ప్ర‌భుత్వం త‌ర‌ఫునే నిర్వ‌హించార‌ని.. అలాంట‌ప్పుడు క‌నీసం.. మాజీ ఎమ్మెల్యే హోదాలో అయినా.. వ‌ర్మ‌కు ఆహ్వానం ఉండి ఉండాల్సింద‌ని అంటున్నారు.