ఏపీ రాజధాని అమరావతికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన స్టార్ హోటళ్ల దిగ్గజ సంస్థలు.. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమంఅయిందా? అంటే.. ఔననే అంటు న్నారు స్టార్ హోటళ్ల నిర్వాహకులు. తాజాగా విజయవాడలోని ఓ హోటల్‌లో త్రి స్టార్ , ఫైవ్ స్టార్ హోటళ్ల యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. అమరావతిలో ఏర్పాటు చేయబోయే స్టార్ హోటళ్ల వ్యవహారంపై చర్చించారు.
సుమారు 17 స్టార్ హోటళ్లు.. వచ్చే ఏడాదిలోపు నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉందని యజమానులు చెప్పారు. వీటిలో ఒబెరాయ్, తాజ్ వంటి ప్రముఖ హోటళ్లు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అయితే.. దేశానికే మరింత వన్నె తీసుకురాగల అమరావతిలో నిర్మాణం కొంత వరకు పూర్తయితే.. మరిన్ని స్టార్ హోటళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం రాజధాని నిర్మాణ దశలో ఉన్నందున.. దీనిపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయని హోటళ్ల యజమానులు పేర్కొన్నారు. నవ నగరాలు(నైన్ సిటీస్) నిర్మాణం వడివడిగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తద్వారా.. మరిన్ని సంస్థలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్న అంచనాకు వచ్చారు. ప్రధానంగా ఐఐటీ, విదేశీ సంస్థలు వస్తే.. హోటళ్లకు గిరాకీ ఉంటుందని.. తద్వారా.. అమరావతిలో వ్యాపార లావాదేవీలు కూడా పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం 17 ప్రధాన హోటళ్లు అమరావతిలో భూముల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్టు వివరించారు. ఎన్నారైలు.. విదేశీ పర్యాటకల రాక పెరుగుతున్న నేపథ్యంలో రాజధానికి స్టార్ ఇమేజ్ వస్తుందని.. తద్వారా అతిథి గృహాల డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని వారు పేర్కొనడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates