జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే… ఎన్నికలప్పుడు జనం వద్దకు రావడం, నోటికొచ్చిన, జనం అడిగిన హామీలు ఇవ్వడం, ఓట్లేయించుకోవడం, ఆపై పత్తా లేకుండా పోవడం… ఆ తర్వాత మళ్తీ ఎన్నికలప్పుడే జనం ముందు ప్రత్యక్షమయ్యే వారనే నానుడి ఉంది. ఇందుకు ఒకరిద్దరు నేతలు మినహాయింపులు ఉన్నా… మెజారిటీ నేతల తీరు ఇంతే. ఈ తరహా రాజకీయానికి పవన్ ఆమడంత దూరం. పాలిటిక్స్ లోకి వచ్చాక పవన్ సాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. నిబద్ధతతో కూడిన రాజకీయం చేస్తున్న పవన్…తాజాగా తన నిబద్ధత ఎలాంటిదో మరోమారు నిరూపించుకున్నారు.
మొన్నామధ్య దక్షిణ భారత ఆలయాలను పవన్ తన కుమారుడు అకీరా నందన్ ను వెంటబెట్టుకుని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కేరళ, తమిళనాడు ఆలయాలను సందర్శించిన పవన్..ఆ సందర్భంగా అక్కడి భక్తులతో మాట్లాడారు. తనతో మాట కలిపిన భక్తులతో ఆయన మాట కలిపారు. తమిళనాడులోని పళని ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడి భక్తులు తన వద్ద ప్రస్తావించిన ఓ అంశానికి సంబంధించి అక్కడికక్కడే ఆయన వారికి ఆ సమస్య పరిష్కారం దిశగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏపీలోని తిరుమల వెళ్లడానికి తమకు నేరుగా బస్సు సౌకర్యం లేని కారణంగా తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, తమ ఇష్ట దైవం అయిన తిరుమల వెంకన్నను దర్శించుకోలేకపోతున్నామని వారు పవన్ కు తెలిపారు. బస్సు సౌకర్యం ఏర్పాటు అయ్యేలా చూస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు.
ఇదంతా ఎప్పుడు జరిగింది? రెండు నెలల క్రితం ఫిబ్రవరి 14న జరిగింది. అక్కడి నుంచి పవన్ వచ్చేశారు. తన రోజువారీ కార్యక్రమాల్లో ఆయన పడిపోయారు. ప్రజా పాలనలో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో పళని భక్తులకు ఇచ్చిన హామీని పవన్ మరిచిపోయి ఉంటారులే అని అంతా అనుకున్నారు. అయితే గురువారం విజయవాడలో ఓ కార్యక్రమం జరిగింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పవన్ ఓ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసు ఎక్కడికో కాదు… నిత్యం తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి తిరిగే బస్సు సర్వీసు. ఎప్పుడో… అది కూడా తనకు ఏమాత్రం సంబంధం లేని పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజలు కోరిన కోరికను పవన్ గుర్తు పెట్టుకుని.. దానిని ఫాలో అప్ చేసి.. రెండు నెలల తర్వాత అయినా కూడా దానిని అమలు చేసి తన నిబద్ధత ఏ పాటిదో నిరూపించుకున్నారు. ఈ లెక్కన అందరూ పవన్ మాదిరిగా ఉంటే… ఎంత బాగుంటుందో కదా అన్న భావన వ్యక్తమవుతోంది.