వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రతువుకు డెడ్‌లైన్ పెట్టారు. ఇప్పటికి రెండు సార్లు ఇలా వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి జనవరి నుంచే ప్రజల మధ్యకు తాను వస్తానని.. చెప్పిన జగన్ తర్వాత ఫిబ్రవరి వరకు పొడిగించారు. దీంతో ఫిబ్రవరిలో అయినా.. తమ నాయకుడు ప్రజల మధ్యకు వస్తాడని.. తమను పట్టించుకుంటారని ప్రజల కంటే ఎక్కువగా పార్టీ కార్యకర్తలు ఎదురు చూశారు.
కానీ, ఆ డెడ్‌లైన్‌ను కూడా తోసిపుచ్చిన జగన్.. ఇప్పుడు తాజాగా మే నెలను డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. మే చివరి వారం తర్వాత.. ప్రజల మధ్యకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలకు తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతారని.. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతారని కూడా.. నాయకులు సదరు సమాచారంలో పేర్కొన్నారు. అయితే.. మే వరకు ఎందుకు ఆగాలన్న సందేహం సహజంగానే వస్తుంది.
కూటమి ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు మే నెలను డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. వీటిలో ప్రధానంగా ‘తల్లికి వందనం’, రైతులు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ.. ‘అన్నదాత సుఖీభవ’, నిరుద్యోగుల ఆశలు తీర్చే మెగా డీఎస్సీలకు మే డెడ్‌లైన్‌గా ఉంది. ఈ నేపథ్యంలో వీటి అమలును చూసిన తర్వాత.. వైసీపీ అధినేత జగన్ అడుగులు వేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ పథకాల అమలులో లోపాలు జరిగితే.. వాటిని ఎత్తి చూపేందుకు.. ఆయన సిద్ధమవుతున్నారు.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం ఆయా పథకాలను మే నుంచి ఇస్తామని చెప్పినా.. ఖజానా సహకరించే అవకాశం లేదని వైసీపీ కూడా అంచనాకు వచ్చింది. దీనిని బట్టి చెప్పింది చేసే అవకాశం కూటమికి లేదని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మే వరకు ఎదురు చూసి.. తర్వాత ప్రజల మధ్యకు రావాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. అయితే.. వైసీపీకి ఈ ఛాన్స్ ఇవ్వకుండా.. ఎలాగైనా సరే.. ఆయా పథకాలను అమలు చేయాలని కూటమి నిర్ణయించుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.