క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులేమో ప్రవీణ్ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయాడని చెబుతుండగా.. ఆయన మద్దతుదారులు మాత్రం ఇది హత్యే అని నొక్కి వక్కాణిస్తున్నారు.
మాజీ ఎంపీ హర్ష కుమార్ సహా పలువురు కుట్ర కోణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే అనుమానాలతో గొడవ చేస్తోంది. కానీ ప్రవీణ్ ఏపీలోని ఒక వైన్ షాపులో మద్యం కొంటున్న.. అస్తవ్యస్తంగా బండి నడుపుతున్న.. రోడ్డు పక్కన తూలి పడిపోయిన వీడియోలను రిలీజ్ చేసి కుట్ర కోణాన్ని కొట్టిపారేశారు. అయినా అవతలి వర్గం నెమ్మదించట్లేదు. వైసీపీ మద్దతుతో పలువురు ప్రవీణ్ మరణం మీద గొడవ చేస్తూనే ఉన్నారు.
ఐతే ఏపీ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోల విషయంలో ఈ వర్గానికి నమ్మకం లేకపోవచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ పరిధి నుంచి ఒక వీడియో బయటికి వచ్చింది. హైదరాబాద్ నుంచి బైక్ మీద బయల్దేరాక ప్రవీణ్ ఎల్బీ నగర్‌లోని ఒక మద్యం దుకాణంలో మందు కొన్న వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేశారు. ఆయన నంబర్ నుంచే డబ్బులు కట్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ బయటికి వచ్చాయి. దీని మీద ఒక టీవీ ఛానెల్‌తో హర్ష కుమార్ కూడా మాట్లాడారు.
ప్రవీణే అక్కడ మద్యం కొన్నట్లుగా ఆధారాలు క్లియర్‌గానే ఉన్నాయని ఆయన అంగీకరించారు. ఇలా హైదరాబాద్‌లో ఒకసారి మద్యం కొని తాగినట్లు తెలుస్తుండగా.. మరోసారి ఏపీలోకి ఎంటరయ్యాక మళ్లీ వైన్ షాపులోకి వెళ్లి మద్యం కొన్నట్లుగా కనిపిస్తోంది. ఇలా మద్యం తాగి తూలుతూ బండి నడపడం.. చనిపోయన స్థలానికి ముందే ఒక చోట బండి మీద నుంచి కింద పడి గాయాల పాలు కావడం.. ఆ సమయంలో తనకు ప్రాథమిక చికిత్స అందించిన వారు సైతం మీడియాతో మాట్లాడిన వీడియోలూ కనిపిస్తున్నాయి. ఇన్ని ఆధారాలున్నా.. ఇంకా కుట్ర కోణం మీదే గొడవ చేయడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.