బాబు ఆలోచ‌న అద్భుతః – ఆనంద్ మ‌హీంద్ర ప్ర‌శంస‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ వ్యాపార, వాణిజ్య‌, పారిశ్రామిక వేత్త‌ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అర‌కు కాఫీని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం.. పీ-4 విధానం ద్వారా పేద‌లను ఉన్న‌త‌ స్థాయికి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి ప్ర‌ముఖుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌హింద్రా కంపెనీ అధిప‌తి ఆనంద్ మ‌హీంద్ర స్పందించారు. చంద‌బాబు ఆలోచ‌న అద్భుతః అని ఆయ‌న ప్ర‌శంసించారు.

“ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి” అని ఆనంద్‌ మహీంద్ర సోష‌ల్ మీడియా మాధ్య‌మం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గిరిజ‌నులు పండించే కాఫీ ఉత్ప‌త్తుల‌కు దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకువ‌చ్చేందుకు చంద్ర‌బాబు చేస్తున్న కృషి బాగుంద‌ని కొనియా డారు. పారిస్‌ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్‌ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొం దించినట్లు ఆనంద్ మ‌హీంద్రా వివరించారు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అర‌కు కాఫీ ఘుమ‌ఘుమ‌లు విస్తరించే రోజులు కొద్ది దూరంలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. గిరిజ‌నులకు మంచి ఆదాయంతోపాటు.. రాష్ట్రానికి మంచి పేరు వ‌స్తున్నాయ‌ని మ‌హీంద్రా తెలిపారు. ఇదిలావుంటే పీ-4 విధానంపైనా ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు.. హ‌ర్షం వ్య‌క్తంచేశారు. ఇలాంటి కార్య‌క్ర‌మం తొలిసారి అమ‌లు చేయ‌డం బాగుంద‌ని వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.