చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని మ‌రోసారి నిరూపించారు. రంజాన్‌ను పుర‌స్క‌రించుకుని.. 10 వేల కిలోల మ‌ట‌న్‌ను, 20 వేల లీట‌ర్ల పాల‌ను ముస్లిం కుటుంబాల‌కు పంపిణీ చేసి.. వారికి రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలా.. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఇంత భారీ ఎత్తున పంపిణీ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. రంజాన్ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని పేద ముస్లింలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీగా జ‌రిగిన‌ మటన్ పంపిణీ కార్యక్రమంలో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు.

సోమవారం తెల్లవారుజాము నుంచి దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా మటన్, పాలు పంపిణీ చేస్తున్నారు. స్థానిక క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు దాదాపు 10 వేల కిలొల మటన్ ను నియోజకవర్గంలోని పేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలోని పేద ముస్లింలకు వ్యక్తిగతంగా మటన్, పాలు అందిస్తూ వారి ఆనందంలో భాగం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరుగుతున్న మటన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు, చిన్నారులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరులోని మస్జీద్ వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, తనపై ఎంతో ప్రేమ అభిమానాలు చూపిన దెందులూరు నియోజకవర్గం లోని ముస్లిం సోదర సోదరీమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాల అండగా ఉంటాను“ అని పేర్కొన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా ప్రవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని ముస్లింలకు మటన్ పంపిణి చేయడం తనకు ఆనవాయితీగా వస్తోంద‌ని చింత‌మ‌నేని చెప్పారు. కరోనా వంటి విపత్కర సమయం వచ్చిన రెండేళ్లు తప్ప ఇప్పటివరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రంజాన్ తోఫా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు.