హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీవిశ్వావసు నామ నూతన సంవత్సరాదిని పురస్కరించు కుని.. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత పంచాంగ శ్రవ ణం చేసిన ఆయన.. అనంతరం ప్రసంగించారు.
బడ్జెట్ ఉగాది పచ్చడి!
ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జట్‌ను ముఖ్యమంత్రి ఉగాది పచ్చడితో పోల్చారు. “ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్…షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిగా ఉంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పించినట్టు తెలిపారు. ప్రజల ఆదాయం పెంచేదిశగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయన్న రేవంత్‌రెడ్డి.. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామని వివరించారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా..
ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. “మూసీ ప్రక్షాళన అనేది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. దీనిని మేం చేపట్టాం. కానీ, కొందరు సైంధవుల్లా అడ్డుపడుతున్నారు. అయినా.. తగ్గేదేలేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం” అని రేవంత్ ఉద్ఘాటించారు. పెట్టుబడుల కోసం వచ్చేవారిని కొందరు అడ్డుకుంటున్నారని బీఆర్ ఎస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అందరికీ సన్నబియ్యం
పేదలు మాత్రమే దొడ్డు బియ్యం తినాలా? వారికి సన్నబియ్యం సౌభాగ్యం వద్దా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారికి కూడా సన్నబియ్యం ఇచ్చేందుకు.. ప్రయత్నిస్తున్నామని అన్నారు. గతేడాది 1.56 లక్షల టన్నుల వరిని పండించాం. ఇది దేశంలోనే అధికం. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 60-65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని పేదలకు పంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.