తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు శనివారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన ఆయన తన ఇంటికి వెళ్లకుండా.. నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ పోలీస్ స్టేషన్ నుంచే తన కార్యకలాపాలను సాగిస్తోంది. ఈ క్రమంలో ముందుగా ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. శ్రవణ్ రావు వచ్చీ రాగానే ఆయనను జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని సిట్ విచారించడం మొదలుపెట్టారు.
విచారణలో భాగంగా అసలు ఈ కేసులో మీరు ప్రధాన నిందితులు కానప్పటికీ ఎందుకు దేశం వదిలి పారిపోయారని సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అంతేకాకుండా విదేశాలకు ఎవరి సహకారంతో వెళ్లారని.. ఆయా దేశాల్లో ఎవరి సహకారంతో తలదాచుకున్నారని, ఎక్కడెక్కడ ఎన్నెన్ని రోజులు దాక్కున్నారని ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబందించి ఎవరి ఆదేశాల మేరకు పాల్పడ్డారని… ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరు అందించారని, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారని, ఎంత కాలం పాటు ఫోన్లను ట్యాప్ చేశారని, ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారా అని, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరి ప్రణాళిక మేరకు మొదలైందని, ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరెరవకి షేర్ చేశారని, ఎలా షేర్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ సమాచాన్ని తీసుకున్న వారిలో నాటి ప్రభుత్వ పెద్దలెవరైనా ఉన్నారా అని… ఇలా రకరకాల ప్రశ్నలు సందించారు.
సిట్ అధికారులు సంధించిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన శ్రవణ్ రావు…మెజారిటీ ప్రశ్నలకు దాటవేత ధోరణినే అవలంభించారట. ఈ క్రమంలో శ్రవణ్ నుంచి వీలయినంతమేర సమాచారాన్ని రాబట్టాలన్న లక్ష్యంతో సిట్ అధికారులు కూడా వేసిన ప్రశ్నలనే మళ్లి మళ్లీ అడగడమే కాకుండా.. ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి అడుగుతున్నట్టుగా సమాచారం. అయినా కూడా శ్రవణ్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అరెస్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు ఉపశమనం కల్పించిన తర్వాతే విదేశాల నుంచి శ్రవణ్ రావు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విచారణకు సహకరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాను విచారణకు వచ్చినట్లుగా చెబుతున్న శ్రవణ్ పదే పదే సుప్రీంకోర్టు పేరును ప్రస్తావిస్తూ సిట్ అదికారుల సహకాన్ని పరీక్షిస్తున్నారట.
సుప్రీంకోర్టు నుంచి ఊరట… విచారణలో న్యాయవాదికి అనుమతి నేపథ్యంలో కొనసాగుతున్న సిట్ విచారణలో పెద్దగా వివరాలేమీ రావన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తానేమీ ఎక్కడికీ పారిపోలేదని, చికిత్స తీసుకోవడానికే తాను విదేశాలకు వెళ్లినట్లుగా శ్రవణ్ రావు సుప్రీంకోర్టుకు చెప్పడం, కోర్టుకు ఆయన లాయర్ చెప్పినట్లుగా 48 గంటలకు తిరక్కుండానే హైదరాబాద్ లో అడుగుపెట్టిన నేపథ్యం… తనపై సిట్ అధికారులు ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా శ్రవణ్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. ఈ కారణంగా విచారణలో కీలక విషయాలను శ్రవణ్ రావు బయటపెట్టే అవకాశాలే లేవన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates