రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ముస్లింలను అక్కున చేర్చుకున్న విషయం తెలిసిందే. మైనారిటీ ముస్లింలకు.. పింఛన్లు ఇవ్వడంతోపాటు పాస్టర్లకు రూ.5000 చొప్పున నెలనెలా భత్యాలు కూడా ఇచ్చింది. ఇక, వారు మక్కా యాత్రలకు వెళ్తే.. అక్కడ కూడా ఏర్పాట్లు చేసింది. రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చింది. అయితే.. మైనారిటీలకు ఇంత చేసినా.. గత ఎన్నికల్లో తమను ఓడించారన్న ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. వచ్చిన తొలి రంజాన్ వేడుకలను మొక్కుబడిగా నిర్వహించారు. విజయవాడలో రెండు రోజుల కిందట నిర్వహించిన ఇప్తార్ విందుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత.. మళ్లీ సందడి లేకుండా పోయింది. దీనికి కారణం.. మైనారిటీ నాయకులు కూడా మౌనంగా ఉన్నారన్న చర్చ సాగుతోంది. ఇది.. ఆయా వర్గాల్లో ఒకింత అసంతృప్తిని లేవనెత్తుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ పుంజుకుంది.
రాష్ట్రంలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ ఒక్కటే మైనారిటీ ముస్లింల వైపు ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. జనసేన ఒకప్పుడు.. మైనారిటీ ముస్లింలకు అండగానే ఉంది. కానీ, సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్ యాత్రలు, దీక్షలుచేయడంలో ఈ వర్గం ఆ పార్టీకి దూరమైంది. నిజానికి ఒకరిద్దరు వైసీపీ మైనారిటీ నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధపడి కూడా ఆగిపోయారు. ఆ తర్వాత.. పార్టీ పూర్తిగా సనాతనం వైపు మళ్లింది. దీంతో ముస్లింలు దూరమయ్యారు.
ఈ గ్యాప్‌ను అంటే.. అటు వైసీపీ, ఇటు జనసేనలు సృష్టించిన గ్యాప్‌ను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసింది. దీనిలో భాగంగా ముస్లింలకు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఇస్తోంది. ఇటీవల విజయవాడలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఆ తర్వాత.. ఇప్పుడు జిల్లాల స్థాయిలో శుక్రవారం ప్రభుత్వమే ఇఫ్తార్ ఇచ్చింది. దీనిలో ఎంతో మంది నాయకులు పాల్గొన్నారు. అంతేకాదు.. శనివారం కూడా మండలస్థాయిలో ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ వదిలేసిన.. ముస్లింలను టీడీపీ అందిపుచ్చుకోవడం గమనార్హం.