“43 ఏళ్ల ప్రయాణంలో టీడీపీ అనేక విజయాలు అందుకుంది.. అదేసమయంలో అనేక సంక్షోభాలను కూడా చవిచూసింది. అయినా.. కార్యకర్తలు ఎప్పుడూ పార్టీని, పార్టీ అధినేతను వెన్నంటిఉన్నారు. వారే పార్టీకి కొండంత బలం. నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్నంత వరకు.. టీడీపీ ఎప్పటికీ ఉంటుంది” అని టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాతే మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టిడిపి, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య గారే మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా చివరి ఓటు పడేవరకు పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల గారే మన దమ్ము. 43ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా హాట్సాఫ్
అని నారా లోకేష్ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నారా లోకేష్ సూచించారు. పార్టీ అదినేత చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. ప్రతి ఒక్కరికీ గుర్తింపు వస్తుందన్నారు. పార్టీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకువెళ్లిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.