ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు

ఏపీలో మద్యం ధరలు కొండెక్కడంతో మందుబాబులు నానా తిప్పలు పడుతోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల హామీల్లో దశల వారీ మద్య నిషేధం విధిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా ఏపీలో మందుబాబుల కిక్కు దిగేలా ధరలు పెంచడంతో పాటు మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్యాన్ని ఏపీకి తరలించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంత పకడ్బందీగా నిఘా పెట్టినప్పటికీ అక్రమ మద్యం రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోలేక పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో మద్యం ధరలపై జగన్ సర్కార్ తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో పెంచిన మద్యం ధరలను తగ్గిస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రకరకాల బ్రాండ్లు, కేటగిరీలలో రూ. 50 నుంచి రూ. 1350 వరకు ధరలు తగ్గిస్తున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది. మీడియం, ప్రీమియం బ్రాండ్లలో 25 శాతం ధరలను తగ్గించగా…బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలను యథాతధంగా ఉంచింది.

ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. అయితే, బీర్లు, రెడీ టు డ్రిక్ ధరలతోపాటు రూ. 200లోపు క్వార్టర్ బాటిల్ ధరల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. క్వార్టర్ రూ. 200ల పైన ధర ఉన్న మద్యం ధరలు తగ్గనున్నాయి. బాటిళ్ల పరిమాణం, బ్రాండ్ లను బట్టి 90 ఎంఎల్ నుంచి లీటర్ వరకు ధరలు రూ. 50 నుంచి రూ. 1350 వరకు తగ్గాయి. తగ్గించిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమలులోకి రానున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఏపీ సర్కార్ వెల్లడించింది. ఎస్ఈబీ నివేదిక ఆధారంగా మద్యం ధరలను తగ్గించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఏది ఏమైనా, తాజాగా తగ్గించిన ధరలతో మందుబాబులు ఊరట చెందారు. ఏపీ సర్కార్ తమకు దీపావళి కానుక ఇచ్చిందని మందుబాబులు సంబరపడుతున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)