వైసీపీకి ఒక దశ-దిశ అంటూ.. లేకుండా పోతోందా? అంటే.. ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి న్యాయం మరో సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన బలంగా ఎస్సీ వర్గాల్లో వినిపిస్తోంది. మాల సామాజిక వర్గానికి ఈ పార్టీ పరిమితం అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్న విమర్శలను పార్టీ పట్టించుకోకపోవడం.. అన్ని విధాలా ఇబ్బందిగా మారిపోయింది.
ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఒక పంథాను ఎంచుకోకపోవడం.. మాదిగ నేతలతో మాదిగలనే తిట్టించడం వంటివి.. ఎస్సీల్లో చిచ్చుకు కారణంగా మారుతున్నాయి. దీనిపై మంద కృష్ణ మాదిగ బాగానే వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై సమాదానం చెప్పకుండా పార్టీ నేతలు తప్పించుకుంటున్నారన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఎస్సీల విషయం ఇలా ఉంటే.. ఇక, ముస్లిం సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునే విషయంలోనూ వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
రంజాన్‌ను పురస్కరించుకుని వైసీపీ భారీ ఎత్తున విజయవాడలో ఇఫ్తార్ విందు ఇచ్చింది. దీనికి జగన్ హాజరయ్యారు. అయితే.. ఆయన ఈ సందర్భంగా ముస్లింల నుంచివచ్చిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన దాటవేత ధోరణినే అవలంభించారు. ఇది ముస్లిం వర్గాలను ఇబ్బందికి గురి చేసింది. ఆది నుంచి ముస్లింలు తమ వెంటే ఉన్నారని చెప్పిన జగన్.. గత ఎన్నికల్లోవారి మద్దతు కోల్పోయారన్నది వాస్తవం.
పైగా.. ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయంలోనూ ఆయన ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్న సంకేతాలు వస్తు న్నాయి. తాజాగా కేంద్రంతో వైసీపీ ఎంపీలు..(రాజ్యసభ, లోక్‌సభలోని సభ్యులు) వక్ఫ్ బిల్లుకు మద్దుతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు ఏవైనా.. కేంద్రంతో లడాయి పెట్టుకునేందుకు వైసీపీ సాహసించలేక పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లింలు కూడా వైసీపీ వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. పైకి బాగుందని అంటున్నా.. గతంలో ట్రిపుల్ తలాక్‌కు, ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా వైసీపీ మద్దుతగా వ్యవహరించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.