టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన జయమంగళ వెంకట రమణ…చంద్రబాబుకు స్వాగతం పలికే సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబుతో జయమంగళ ఏదో చెబుతూ అలా ఉండిపోయారు. జయమంగళను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. ఆయన చెప్పినదంతా సావదానంగా విన్నారు.
అయినా ఇందులో వింత ఏముందంటారా? ఏలూరు జిల్లాలో ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు సంపాదించుకున్న జయమంగళ.. చంద్రబాబుకు పాదాభివందనం చేయడంలో తప్పేముంది? రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబు ఆశీర్వాదాన్ని జయమంగళ తీసుకోవడంలో తప్పేముంది? ఇందులో తప్పేమీ లేదు. అయితే మరీ ఈ వీడియో ఎందుకు వైరల్ గా మారిపోయింది? రాజకీయ వర్గాల్లో ఈ వీడియో ఎందుకు అంతగా చర్చకు తెర తీసింది? సరే అయితే ఆ విషయంలోకే వెళ్లిపోదాం పదండి.
ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన జయమంగళ 1999లో టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్సాహంగా కదిలిన జయమంగళకు చంద్రబాబు మంచి గుర్తింపే ఇచ్చారు. పార్టీలోకి వచ్చీరాగానే.. పార్టీ కార్యనిర్వహాక కార్యదర్శి పదవి ఇచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీగా అవకాశం కల్పించారు. అంతేనా 2009 ఎన్నికల్లో ఏకంగా కైకలూరు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ఫలితంగా 2009లోనే జయమంగళ శాసనసభలో అడుగుపెట్టేశారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా కైకలూరు టికెట్ బీజేపీకి దక్కగా… జయమంగళ పోటీకి దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి తిరిగి టీడీపీ టికెట్ ను దక్కించుకున్న జయమంగళ ఓలమిపాలయ్యారు. అయినా గానీ 2023 దాకా ఆయన టీడీపీలోనే ఉన్నారు. సరిగ్గా 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా ఏం జరిగిందో తెలియదు గానీ… టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. జయమంగళ ఇలా ఎమ్మెల్సీగా పదవి చేపట్టారో లేదో అలా 2024 ఎన్నికలు వచ్చేశాయి. తనకు రాజకీయం నేర్పిన టీడీపీ ఘన విజయం సాధించగా… తనకు ఎమ్మెల్సీ ఇచ్చిన వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.
ఏం చేయాలో జయమంగళకు పాలుపోలేదు. టీడీపీతో పాటు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జనసేనలో తనకు మంచి సంబంధాలే ఉండగా… వాటిని కాస్తంత యాక్టివేట్ చేశారు. ఈ క్రమంలో తన శ్రేయోభిలాషులు చెప్పిన మాట మేరకు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేరుగా జనసేనలో చేరిపోయారు. టీడీపీ ఉండగా… జనసేనలోకి ఎందుకు అని అంతా ప్రశ్నార్థకంగా చూశారు. జయమంగళ లెక్కలు ఆయనకు ఉంటాయి కదా. ఇవన్నీ గుర్తు చేసుకుని తాను తీసుకున్న నిర్ణయాలను పెద్ద మనసుతో క్షమించేయాలని ఆయన చంద్రబాబుకు పాదాభివందనం చేసినట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates