బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సీరియస్ విచారణకు సిట్ సిద్ధం!

తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం కొనసాగుతూనే ఉంది. యువతను ఫైనాన్స్ దోపిడీ దిశగా నెట్టేసిన ఈ యాప్స్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సెలబ్రిటీల ప్రమోషన్లు, యూట్యూబర్ల స్వార్థపు లాభాల కోసం జరుగుతున్న ఈ ప్రకటనల వలన అమాయకులు బలవుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలో పలువురు ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రొమోటర్లపై కేసులు నమోదు కాగా, 25 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్ యాంకర్లు, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లపై విచారణ వేగంగా సాగుతోంది. కొంతమంది ఇప్పటికే పోలీసులు విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది విదేశాలకు పారిపోయిన విషయం బయటపడటంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన సీరియస్ గా చూస్తున్న ప్రభుత్వం, ఇకపై ఇలాంటి యాప్స్‌ను రూట్ లెవెల్ నుంచే అడ్డుకోవాలని నిర్ణయించింది. గతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు ఈ యాప్స్ కారణం కావడం, యువత అప్పుల ఊబిలో చిక్కుకోవడం వంటి సంఘటనలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. ఇందువల్లే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై అనుభవం ఉన్న అధికారులతో ఈ ప్రత్యేక బృందాన్ని రూపొందించనున్నారు.

ఇకపై బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలపై పక్కాగా నిఘా ఉంటుందని తెలుస్తోంది. పబ్లిక్ ఫిగర్స్ చేసే ప్రమోషన్లకు నియమాలు విధించే అవకాశం ఉంది. కేంద్రం, గూగుల్ వంటి సంస్థలతో కూడ సంబంధిత కమ్యూనికేషన్ జరిగేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, యాప్ వెనుక ఉన్న సంస్థల డిటైల్స్‌ను అన్వేషించేలా సిట్ దర్యాప్తు సాగనుంది. ఈ చర్యలతో బెట్టింగ్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందనే నమ్మకంతో ప్రజలు చూస్తున్నారు.