తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. అనేక అంశాలపై ఇరు పక్షాలు సవాళ్లు-ప్రతిసవాళ్లు రువ్వుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ఆయన ‘కమీషన్ కే’ అని సంబోధించారు. కేసీఆర్ పేరును పైకి చెప్పకపోయినా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగారు.
సభలో బీఆర్ఎస్ వ్యవహార శైలిపై స్పందించిన ఆది శ్రీనివాస్.. తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపే అవకాశం ఉన్నా.. బీఆర్ ఎస్ సభ్యులు మాత్రం వెల్‌లోకి దూసుకు వెళ్లారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం సంప్రదాయమని ప్రశ్నించారు. పదేళ్లపాటు సభను నడిపిన బీఆర్ఎస్‌కు ఇంగితం లేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మరింత రెచ్చిపోయారు. ఈ సమయంలో కొందరు ఆది వ్యాఖ్యలను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసే ప్రయత్నం చేశారు.
దీనిని తీవ్రంగా ఖండించిన ఆది.. సభలో ఫొటోలు, వీడియోలు తీయరాదన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. సభలో ఫొటోలు తీసిన వారిని బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేసమయంలో కమీషన్-కే అంటూ.. ఆది ప్రస్తావించారు. “అధ్యక్షా.. బీఆర్ఎస్ పాలనలో కొన్ని కోడ్ భాషలు ఉండేవి. కమీషన్ – కే అంటే.. కాళేశ్వరం” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదని.. అది కమీషన్ ప్రాజెక్టు అని చాలా మంది చెప్పినట్టు తెలిపారు.
అంతేకాదు.. ‘కమీషన్ – కే.. అంటే కరెంటు కొనుగోళ్లు’ అని కూడా ఆదిఅన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పం దాల్లోనూ తినేశారని అన్నారు. అదేవిదంగా కమీషన్ – కే అంటే కాకతీయ అని చెప్పారు. దీంతో బీఆర్ ఎస్ నాయకులు ఎదురు దాడి చేశారు. ఫలితంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్పీకర్ పదే పదే చెప్పినా.. బీఆర్ ఎస్, కాంగ్రెస్ సభ్యులు ఒకరిపై ఒకరు నినాదాలు అరుపులతో హోరెత్తించారు.