భ‌విష్య‌త్తు స‌రే.. వ‌ర్త‌మానం మాటేంటి?

భ‌విష్య‌త్తు గురించిన ఆలోచ‌న అవ‌స‌ర‌మే. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. పైగా.. భ‌విష్యత్తుపై ప‌క్కా ల‌క్ష్యం కూడా ఉండాలి. దీని కోసం త‌పించాలి కూడా. అది వ్య‌క్తిగ‌త జీవిత‌మే అయినా.. రాజకీయ భూమిక అయినా.. ల‌క్ష్యం నిర్దేశించుకుని భ‌విష్య‌త్తు కోసం పోరాటం చేయడం త‌ప్పుకాదు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను విశ్లేషించుకుని.. ముందు వాటిని స‌రిదిద్దు కోవాల్సిన అవ‌సరం వ్య‌క్తుల‌కు, రాజ‌కీయాలకు కూడా ఉంటుంది.

వ‌ర్త‌మానం బాగోలేకుండా.. భ‌విష్య‌త్తుపై ఆశ‌లు పెంచుకుంటే.. ప్ర‌యోజ‌నం కూడా అంతంత మాత్ర‌మే అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జ‌రుగుతోంది. పార్టీ అధినేత జ‌గ‌న్ ఉదాశీన వైఖ‌రి కార‌ణంగా.. పార్టీ నాయ‌కులు వ‌ర్త‌మానాన్ని కోల్పోతున్న ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. లెక్క‌కు మిక్కిలి కేసులు ఎదుర్కొంటున్న‌వారు ఒక‌వైపుక‌నిపిస్తున్నారు. మ‌రోవైపు.. కేసుల బెంగ‌తో ఇంటికే ప‌రిమితం అవుతున్న‌వారు కూడా ఉన్నారు.

వీరి విష‌యాన్ని జ‌గ‌న్ త‌క్ష‌ణావ‌స‌రంగా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఎక్క‌డ ఎవ‌రు ప‌ల‌క‌రించినా.. వ‌ర్త‌మానాన్ని వ‌దిలేస్తున్న జ‌గ‌న్‌.. భ‌విష్య‌త్తును ప‌ట్టుకుని వేలాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రో మూడేళ్ల‌లో మ‌న‌దే అధికారం.. మీరు అప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూడండి అని చెబుతున్న మాట‌లు.. ఆప‌ద లో ఉన్న కార్య‌కర్త‌లు, నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. మా అన్న మార‌డ‌నే మాటే వినిపించేలా చేస్తోంది. ఇది భవిష్య‌త్తుకు మ‌రింత విఘాతంగా మారే సూచ‌న‌లు, సంకేతాలు ఇస్తోంద‌న‌డంలో సందేహం లేదు.

గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముందుకు క‌దిలారు. న్యాయ‌ప రంగా నాయ‌కుల‌ను, కార్య‌కర్త‌ల‌ను కూడా ఆదుకున్నారు. అరెస్టు చేస్తున్నార‌ని తెలిసిన వెంట‌నే లాయ‌ర్లు ముందుకు న‌డిపించారు. బెయిల్ వ‌చ్చేలా చేశారు. త‌ద్వారా.. పార్టీ అదినేత త‌మ వెంట ఉన్నార‌న్న భ‌రోసా కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు పెరిగింది. త‌ద్వారా వారు ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు నుంచి పుంజుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. కానీ, ఈ త‌ర‌హా సంకేతాలు వైసీపీలో క‌నిపించ‌డం లేద‌న్న చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. కాబట్టి భ‌విష్య‌త్తు ఎలా ఉన్నా.. వ‌ర్త‌మానం దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది.