తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం రెడీ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా క్రతువుకు.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తాంబూలాలిచ్చేసింది. దీంతో ఇప్పుడు ఎవరికి వారు.. తమను తాము మంత్రివర్గంలో చూసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. 2023, డిసెంబరులో ఏర్పడిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు శాఖలు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హోం శాఖ ఇప్పటికీ రేవంత్ రెడ్డి వద్దే ఉంది. ఇక, ఎస్సీలు, బీసీలు, మైనారిటీల వ్యవహారాలకు కూడా మంత్రుల అవసరం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రావడం.. ఆవెంటనే దీనిని సీఎం రేవంత్ రెడ్డో.. ఇతర మం త్రులో ఖండించడం పరిపాటిగా మారిపోయింది. ఇక, ఈ ప్రభావం భవిష్యత్తులో వచ్చేస్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపిం చే అవకాశం ఉందని గ్రహించిన పార్టీ సీనియర్లు, ముఖ్యంగా ఇటీవల కొత్తగా నియమితులైన ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ గ్రహిం చారు. దీంతో హుటాహుటిన మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దలు పచ్చజెండా ఊపారు. ఉగాదినిపురస్కరించుకుని.. ఆ రోజు లేదా.. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న చర్చ సాగుతోంది.
ఇక, ఈ మంత్రివర్గ జాబితాపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే రెండు మూడు జాబితాలు కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులకు చేరిపోయాయి. కానీ, ఇంకా మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. షబ్బీర్ అలీని మంత్రివర్గంలోకి తీసుకుని.. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మైనారిటీ కోటాలో ఆయనకు ప్రముఖ స్థానం కల్పిస్తారన్న చర్చసాగుతోంది.
ఇక, ప్రభుత్వానికి బాసటగా ఉన్న వివేక్‌ను ఎస్సీ కోటాలో తీసుకుంటారని సమాచారం. ఇక, రెడ్డి సామాజిక వర్గం నుంచి లిస్టు బాగానే ఉందని తెలిసింది. సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలు ఆశావహులుగా ఉన్నారు. వీరితోపాటు బీసీ కోటాలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్ కూడా ఆశలు జోరుగానే పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.