వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం నిద్ర లేచినంతనే కడుపులో భరించలేనంత నొప్పి రావడంతో ఆయన నేరుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. తీవ్ర కడుపు నొప్పితో తమ వద్దకు వచ్చిన నానిని అడ్మిట్ చేసుకున్న ఏఐజీ ఆసుపత్రి వైద్యులు… ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతోనే నాని ఆసుపత్రిలో చేరారని చెబుతున్న వైద్యులు.. గతంలో ఆయన ఆరోగ్యపరమైన రికార్డులను చూసిన తర్వాత గుండెకు సంబంధించిన వ్యాధుల పైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే గుండెపోటు కారణంగానే నానిని ఆసుపత్రిలో చేర్చారన్న వార్తలు బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్గుగా సమాచారం.
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసబెట్టి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాని పార్టీలతో సంబంధం లేదన్నట్లుగా జయకేతనం ఎగురవేశారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన నాని.. టీడీపీ తరఫున 2004తో పాటు 2009 లోనూ గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరిన నాని…ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారిన నాని… వైసీపీలో కీలక నేతగా ఎదిగారు.
ఇక 2014, 2019 ఎన్నికల్లోనూ గుడివాడ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని… వైసీపీ అధికారంలోకి రాగానే… జగన్ ఫస్ట్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి పోయినా కూడా నాని పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అయితే వైసీపీ మీద జనాల్లో పెరిగిన వ్యతిరేకతకు తానూ ఓ కారణంగా నిలిచిన నాని.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై నిత్యం అసభ్య పదజాలంతో పేట్రేగిపోయిన నాని… సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారన్న వాదనలు లేకపోలేదు.
2024 ఎన్నికల తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కొడాలి నానిపైనా త్వరలోనే కేసులు తథ్యమన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో గుడివాడలో పెద్దగా కనిపించని నాని… తన మకాంను హైదరాబాద్ కు మార్చినట్లుగా సమాచారం. గుడివాడలో అస్సలే కనిపించని నాని… ఏదో ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పించి ఆయన ఏపీకి రావడం లేదు. తన అనుచరులకు కూడా ఆయన పెద్దగా అందుబాటులో ఉండటం లేదనీ సమాచారం. ఇలాంటి నేపథ్యంలో నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నేరుగా ఏఐజీ ఆసుపత్రికి ఆయనను తరలించడం చూస్తుంటే…పరిస్తితి కాస్తంత సీరియస్ గానే ఉందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates