రేవంత్‌కు అగ్ని ప‌రీక్షే.. ఇదీ విష‌యం!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు మ‌రో అగ్ని ప‌రీక్ష ఎదురైంది. ఇటీవ‌ల జ‌రిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోక‌పోగా.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఆ పార్టీ జోష్ మ‌రింత పెరిగింది. ఫ‌లితంగా రేవంత్ వ్య‌వ‌హారంపై అనేక అనుమానాలు కూడా వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు హైద‌రాబాద్‌ స్థానిక సంస్థ‌ల కోటాలో తాజాగా మ‌రో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చింది. దీనిలో అయినా.. కాంగ్రెస్ గెలుస్తుందా? అనేది ప్ర‌శ్న‌.

బీఆర్ఎస్ నాయ‌కుడు ప్ర‌భాక‌ర్‌.. ప‌ద‌వీ కాలం మే1వ తేదీతో ముగియ‌నుంది. దీంతో ఆ ఒక్క స్థానానికీ తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ క్ర‌మంలో జీహెచ్ ఎంసీలో కాంగ్రెస్ బ‌లంపైనా.. ఈ ఎన్నిక‌ల్లో చూపించే స‌త్తాపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జీహెచ్ ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు. 2020లో జ‌రిగిన చివ‌రి ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించింది. మొత్తం 56 వార్డుల్లో బీఆర్ ఎస్ విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, బీఆర్ఎస్ మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ 44 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఈ రెండు క‌లిపి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మ‌రో పార్టీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీకి 48 మంది స‌భ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు కేవ‌లం అప్ప‌ట్లో ఇద్ద‌రు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. రేవంత్‌రెడ్డి స‌ర్కారు కొలువుదీరిన త‌ర్వాత‌.. మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి.. కాంగ్రెస్ గూటికి చేరారు. అయిన‌ప్ప‌టికీ.. బీఆర్ ఎస్ ఆధిప‌త్య‌మే కొన‌సాగుతోంది.

కాంగ్రెస్ వైపు వ‌చ్చార‌ని,.. లేదాసానుకూలంగా ఉన్నార‌ని భావిస్తున్న‌వారు కూడా 30కి మించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు .. కాంగ్రెస్ పార్టీకి ఏమేర‌కు మేలు చేస్తాయ‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. ఎంఐఎం.. బీఆర్ ఎస్‌లు క‌లిసే ఉన్నాయి. ఫ‌లితంగా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌న స‌త్తా చాట‌డం అంటే.. అంత ఈజీకాదు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎలా వ్య‌వ‌హరి స్తార‌న్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం అయితే.. బీఆర్ ఎస్+ ఎంఐఎం క‌లిస్తే.. ఎమ్మెల్సీ సీటు వారికే సొంత‌మ‌వు తుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి.